● యాత్ర బృందంలో జిల్లా వాసులు
కామారెడ్డి టౌన్: మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ సైకిల్ ర్యాలీ డిసెంబర్ 1వ తేదీన జిల్లాకు చేరుకోనున్నది. ‘సే నో టు డ్రగ్స్’, ‘నషా ముక్తి తెలంగాణ’ నినాదాలతో తొమ్మిది మంది సైక్లిస్టుల బృందం యాత్రను నిర్వహిస్తోంది. బృందంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ముగ్గురు రైడర్లు ఉండగా, వారిలో ఇద్దరు కామారెడ్డికి చెందినవారు ఉన్నారు. ఈగల్ సెల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్, హోమియోపతి వైద్యుడు శ్రీకాంత్, సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీధర్ భాగస్వాములయ్యారు. ఈ మేరకు గురువారం ఇన్స్పెక్టర్ మల్లేశ్ ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలిపారు. శ్రీనగర్‌లోని 216 ట్రాన్సిట్ క్యాంప్ వద్ద ఆర్మీ అధికారులు ప్రారంభించిన ఈ ర్యాలీ జాతీయ రహదారి–44 మీదుగా సుమారు 12 రాష్ట్రాలను దాటుతూ 3,700 కిలోమీటర్ల మేర సాగనుందన్నారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.


