● ఇంకుడు గుంతలు, వ్యవసాయ
కుంటల నిర్మాణాలపై దృష్టి సారించాలి
● అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి
కామారెడ్డి టౌన్: వీబీ జీ రామ్‌జీ పథకంలో భాగంగా చేపడుతున్న అన్ని పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో ఉపాధి పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి హాజరైన అదనపు కలెక్టర్, అనంతరం జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం, బోరుబావుల రీఛార్జ్ నిర్మాణాలు, వ్యవసాయ కుంటల తవ్వకం పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి తగినన్ని నిధులు ఉన్నాయని, పనులు పూర్తయిన 15 రోజుల్లోపే బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. పనుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో చందర్, డీపీవో మురళి, ఎంపీడీవోలు, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు.


