గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

చెరువులో పడి ఒకరు.. కారులో చెలరేగిన మంటలు

నాగిరెడ్డిపేట: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేట మండలం తాడూర్‌గేట్‌ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన దాసరి వెంకట్‌(44)కు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. మంగళవారం రాత్రి ఇంటి నిర్మాణ పనులు ముగించుకొని బైక్‌పై మెదక్‌కు వెళ్తుండగా తాడూర్‌ గేట్‌ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రామారెడ్డి: కన్నాపూర్‌ తండా శివారులోని కన్నయ్య చెరువులో ఓ వ్యక్తి పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన షేక్‌ లాల (45)అనే వ్యక్తి ఈ నెల 9న కన్నాపూర్‌ తండా సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. పొలం సమీపంలో ఉన్న కన్నయ్య చెరువు గట్టుపై షేక్‌ లాల బట్టలు, బైక్‌ కపినించాయి. దీంతో చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఓ కారులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కారుకు జిల్లా కేంద్రంలో మరమ్మతులు చేయించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై వెళ్తుండగా ఒక్కసారిగా ఇంజిన్‌ నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. గమనించిన కారు యజమాని వెంటనే వాహనాన్ని పక్కకు ఆపి బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం ఆయన అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలి దగ్ధమైంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement