కామారెడ్డి టౌన్ : జాతీయస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లాకు, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న పెరమ్ స్వామి కుమార్తె పెరమ్ అక్షిత 70వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అక్షితతో పాటు ఆమె తండ్రి స్వామిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక
కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం గర్గుల్ జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలను ఈ నెల 9న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండర్–14 విభాగంలో బాలికల హాకీ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో జెడ్పీహెచ్‌ఎస్ గర్గుల్ పాఠశాలకు చెందిన శరణ్య, వర్షిత, సోనాక్షి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. వీరిని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో వై. ఎల్లయ్య, గ్రామ సర్పంచ్ దివ్య రవితేజ గౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు సీనియర్ హాకీ క్రీడాకారులు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నోముల మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయులు క్రీడాకారులను అభినందించారు.


