సూర్య ఘర్‌తో కరెంట్‌ బిల్లులకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

సూర్య ఘర్‌తో కరెంట్‌ బిల్లులకు చెక్‌

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

● ఇళ్లల్లో సోలార్‌ విద్యుత్‌కు

పెరుగుతున్న ఆదరణ

● కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో ఆసక్తిచూపుతున్న జనం

ఎల్లారెడ్డిరూరల్‌/బాన్సువాడ రూరల్‌: మారుతున్న ప్రజల జీవనశైలి, పెరుగుతున్న విద్యుత్‌ ఉపకరణాల వినియోగంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్‌ బిల్లులు భారమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకునేందుకు సౌర విద్యుత్‌ ఓ ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తోంది. ఇంటి పైకప్పుపైనే సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడంతోపాటు, కేంద్రప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పొందే అవకాశాన్ని ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ’ యోజన కల్పిస్తోంది. అర్హులైన గృహ వినియోగదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే విద్యుత్‌ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ప్రభుత్వం సబ్సిడీ సైతం ఇవ్వడంతో జిల్లాలో చాలా మంది ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.

జిల్లాలో 856 మంది..

పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన కింద జిల్లాలో ఇంత వరకు 856 మంది సోలార్‌ పవర్‌ ప్లాంటును ఏర్పాటు చేసుకున్నారు. మరో పది మంది సోలార్‌ పవర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో బాన్సువాడ డివిజన్‌లో 182 మంది లబ్ధిదారులు సోలార్‌ యూనిట్లు బిగించుకుని, విజయవంతంగా వినియోగిస్తున్నారు. కిలో వాట్‌ సోలార్‌ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం రూ.30 వేల సబ్సిడీ ఇస్తుండగా, 2కేవీకి రూ.60 వేలలు, 3కేవీ మించిన వాటికి రూ.78 వేలు సబ్సిడీని అందిస్తోంది. కరెంట్‌ బిల్లుల మోతతోపాటు, పవర్‌ ప్రాబ్లం కారణంగా చాలా మంది ఈ పథకం పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇంటి భవనాలపై అనువుగా వీటిని అమర్చి సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేసుకుని మిగిలిని విద్యుత్‌ను ప్రభుత్వ రంగ సంస్థకు విక్రయిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు కరెంటు బిల్లు పోను మిగితా యూనిట్ల డబ్బులు వారి ఖాతాలలో జమ అవుతున్నాయి.

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు..

అర్హులైన గృహ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌, ఆమోదిత విక్రేత ఎంపిక, సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు, తనిఖీ, నెట్‌ మీటరింగ్‌ తదితర ప్రక్రియలను పథకం మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేస్తారు. సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకునే ముందు ఇంటి విద్యుత్‌ వినియోగం, అవసరమైన ప్లాంట్‌ సామర్థ్యం, పైకప్పుపై అందుబాటులో ఉన్న స్థలం, మొత్తం వ్యయం, సబ్సిడీ అర్హతలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement