బాన్సువాడ రూరల్: ఉపాధిహామీ (వీబీజీ–రామ్జీ) పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత నిర్మించాలని బాన్సువాడ మండల ప్రత్యేకాధికారి మల్లికార్జున్ అన్నారు. మండలంలోని కొయ్యగుట్టతండా పంచాయతీ పరిధిలో మంగళవారం ఆయన సర్పంచ్ గూగ్లోత్ శ్రీనివాస్, కార్యదర్శి రాహేలాబేగంతో కలిసి ఇంకుడుగుంత పనులు ప్రారంభించారు. ఇబ్రాహీంపేట్ తండా, బోర్లంక్యాంపు తండాల్లోనూ ఆయా గ్రామాల సర్పంచ్లు స్వరూప వసంత్, నర్సవ్వల ఆధ్వర్యంలో ఇంకుడుగంత పనులు ప్రారంభించారు. పనులను ఎంపీడీవో ఆనంద్, ఎంపీవో మహబూబ్ పరిశీలించారు. కార్యదర్శులు సాయికుమార్, క్షేత్రసహాయకుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొడప్గల్(జుక్కల్): భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఇంకుడు గుంతల నిర్మాణం ఎంతో అవసరమని ఎంపీవో లక్ష్మికాంత్రెడ్డి అన్నారు.మండలంలోని అంజని గ్రామంలో మంగళవారం నూతనంగా నిర్మించిన ఇంకుడు గుంతను ఎంపీవో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపు నీటిని, వృథా నీటిని ఒడిసిపట్టడం ద్వారా భవిష్యత్లో తాగు, సాగు నీటి ఎద్దడిని అరికట్టవచ్చని ఆయన తెలిపారు. ఎంపీవో సుదర్శన్, సర్పంచ్ సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


