దీపావళి.. ఐదు రోజుల వేడుక | - | Sakshi
Sakshi News home page

దీపావళి.. ఐదు రోజుల వేడుక

Nov 8 2026 1:07 AM | Updated on Nov 8 2026 1:07 AM

తొలిరోజు వసుబారస్‌ (గోపూజ) రెండో రోజు ధనత్రయోదశి.. మూడో రోజు దీపావళి.. నాలుగో రోజు బలిపాడ్యమి.. ఐదోరోజు భావూ బీజ్‌.. అతిథులను ఆహ్వానిస్తాం.. రోజుకో రకంగా..

మద్నూర్‌(జుక్కల్‌) : మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మద్నూర్‌ మండలంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. పండుగపైనా అక్కడి సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. సాధారణంగా ఇతర ప్రాంతాలలో ఒకటి రెండు రోజులు దీపావళి జరుపుకుంటే.. మద్నూర్‌లో మాత్రం ఐదు రోజులపాటు చేసుకుంటారు. దీపావళికి రెండు రోజుల ముందునుంచే ఇక్కడ సందడి కనిపిస్తుంది.

వసుబారస్‌తో పండుగ సందడి మొదలవుతుంది. వసుబారస్‌ అంటే గోవు ద్వాదశి అని అర్థం. దీపావళికి ముందు వచ్చే ఆశ్వయుజ మాసం ద్వాదశి రోజున దీన్ని జరుపుతారు. ఈ రోజున ఆవు, దూడను కలిపి పూజిస్తారు. ఆవుకు పసుపు కుంకుమ పెట్టి పూలమాల వేస్తారు. దూడతో సహా ఆవుకు హారతి ఇస్తారు. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారు. ఆ రోజు ఆవు పాలు తాగరు. ఆవును పనికి పంపరు. ఆవు దయ వల్ల ఇంట్లో సుఖం, సంపద లభిస్తాయని ప్రజలు నమ్ముతారు.

ఈ రోజును ధన్వంతరి జయంతిగానూ జరుపుకుంటారు. ఆయుర్వేదానికి అధిపతి అయిన ధన్వంతరి అమృత కలశంతో పుట్టిన రోజు ఇదే. ఈ రోజు కొత్త బంగారం, వెండి, స్టీల్‌ సామగ్రి, కొత్త వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజించి, ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. వ్యాపారులు ఈ రోజు నుంచే కొత్త ఖాతా పుస్తకాలు రాయడం మొదలు పెడతారు.

దీపావళి పండుగను అంతటా జరుపుకుంటారు. ఈ రోజు ఇంటినంతా శుభ్రం చేసి ముగ్గులు వేసి దీపాలతో అలంకరిస్తారు. సాయంత్రం లక్ష్మీదేవి, గణపతిని పూజించి స్వీట్లు పంచుకుంటారు. చీకటిని పోగొట్టి, వెలుగును తెచ్చే పండుగ ఇదని భావిస్తారు. మద్నూర్‌లో కొందరు దీపావళి రోజున, మరికొందరు మరుసటి రోజు పాడ్యమి నాడు లక్ష్మీ పూజ చేస్తారు.

అమావాస్య మరుసటి రోజున వచ్చే పాడ్యమిని బలి పాడ్యమిగా చెబుతారు. ఈ రోజున కూడా ప్రజలు లక్ష్మీదేవి పూజలు నిర్వహిస్తారు. భార్యాభర్తలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. ఈ రోజును కొత్త సంవత్సరం ప్రారంభంగా భావిస్తారు.

దీపావళి సంబురాల్లో చివరి రోజు అత్యంత అప్యాయత నిండిన పండుగ. దీన్ని అన్నా–చెల్లెళ్ల పండుగ అంటారు. ఈ రోజు చెల్లెలు అన్నకు తిలకం పెట్టి, హారతి ఇచ్చి, తీపి వంటకాలు తినిపిస్తుంది. అన్న చెల్లెలికి బహుమతి ఇచ్చి జీవితాంతం రక్షిస్తానని మాట ఇస్తాడు. మద్నూర్‌లో ఈ రోజున అన్నదమ్ములు చెల్లెళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

మద్నూర్‌లో లక్ష్మీపూజ (ఫైల్‌)

దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తున్న కుటుంబ సభ్యులు (ఫైల్‌)

దీపావళి వచ్చిందంటే సందడి నెలకొంటుంది. స్నేహితులందరం కలిసి వారం రోజుల పాటు టపాసులు కాలుస్తూ ఎంజాయ్‌ చేస్తాం. ఇంట్లో తిపి వంటకాలు చేసుకుంటాం. అతిథులను పండుగకు ఇంటికి ఆహ్వానిస్తాం. మహారాష్ట్ర సంస్కృతి ప్రభావంతో ఇక్కడ దీపావళి మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది.

–శివానిగౌడ్‌, బీటెక్‌ స్టూడెంట్‌, మద్నూర్‌

దీపావళి పండుగను మేం ఐదు రోజుల పాటు జరుపుకుంటాం. ఒక్కో రోజు ఒక్కో పండుగ ఉంటుంది. దీపావళి రోజున ఇళ్లంతా పేయింట్లు వేస్తాం. కొత్త డ్రెస్సులు కొనుక్కుంటాం. లక్ష్మీ దేవికి ప్రత్యేకంగా నైవైద్యం సమర్పిస్తాం. తెల్లవారే వరకు లక్ష్మీదేవి వద్ద దీపం వెలుగుతు ఉండేలా చూస్తాం.

–రత్నప్రభ, గృహిణి, మద్నూర్‌

రోజూ పూజలు.. విందు భోజనాలు..

మద్నూర్‌ ప్రాంతంలో దీపావళి సందర్భంగా ఐదు రోజుల పాటు ప్రతి ఇంట్లో రోజూ పూజలు జరుగుతాయి. తీపి వంటకాలు చేసి అతిథులకు ఆహ్వానం పలుకుతారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి టిఫిన్లు, స్వీట్లతో మర్యాద చేస్తారు. పండుగలో భాగంగా ఒక రోజు మద్నూర్‌లో మార్వాడీలు అందరూ కలిసి సాయంత్రం వేళ పట్టణంలోని అన్ని దుకాణాలకు వెళతారు. దుకాణదారులు వారికి స్వీట్లు, పాన్‌, టీ అందిస్తారు. మరొక రోజు వ్యాపారులు అందరూ కలిసి ఆత్మీయులు, మిత్రుల వద్దకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు. మతాలు, వర్గాలకు అతీతంగా మద్నూర్‌లో దీపావళిని స్నేహం, అప్యాయతలతో జరుపుకుంటారు.

మద్నూర్‌లో మహారాష్ట్ర సంస్కృతి

రెండు రోజుల ముందే

మొదలైన సందడి

నేడు దివ్వెల పండుగ

రేపు బలిపాడ్యమి, ఎల్లుండి భావూ బీజ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement