సరదాగా మొదలయ్యే పేకాట చివరకు వ్యసనంలా మారుతోంది. మూడుముక్కలాట పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. కష్టపడి సంపాదించిన డబ్బు కుటుంబ అవసరాలకు కాకుండా, రాత్రికి రాత్రే కోటీశ్వరుమైపోవచ్చనే భ్రమలో పేకాటకు తగలేస్తున్నారు. పేకాట స్థావరాలపై పోలీసు యంత్రాంగం దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా సరే అడ్డాలు మారుతున్నాయి తప్ప ఆట ఆగడం లేదు.
● పోలీసు దాడులు పెరిగినా ఆగని జూదం
● దీపావళి వేళ మరింత పెరిగిన ఆట
● పేకాటతో రోడ్డున పడుతున్న కుటుంబాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో పేకాట జోరుగా సాగుతోంది. పోలీసులు పేకాటపై నిఘా పెంచారు. ఎక్కడ ఆడుతున్నా దాడులు చేస్తున్నారు. పోలీసులు దాడులు జరిగిన మరుసటి రోజు నుంచే మళ్లీ యథావిధిగా పేకాడుతున్నట్లు తెలుస్తోంది.
పేకాడేవారు పట్టణాలు, ఊరుకు చివరన చెట్ల పొదలు, పొలాల వద్ద, అడవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫామ్‌హౌజ్‌లు, హోటళ్లు, లాడ్జీలతో పాటు ఇళ్లల్లోనూ పేకాడుతున్నారు. కొందరు ఇళ్లలో పేకాట నిర్వహిస్తూ షోకు ఇంత అని వసూలు చేస్తున్నారు. ఆడేవారికి కావల్సిన తిండి, మద్యం ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు నిఘా పెరగడంతో తరచూ అడ్డాలు మారుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో ఇళ్లే అడ్డాలుగా మారాయని తెలుస్తోంది. హోటళ్లు, లాడ్జీలలో కూడా ఆట నడుస్తోంది. కాగా పేకాడే బడాబాబులు మాత్రం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్లలో ఏదో దావత్ ఉందనే భావన కలిగేలా ఏర్పాట్లు చేసుకుని ఆడుతున్నారు. రోజూ ఒకరి ఇంట్లోనే ఆడితే అనుమానం వస్తుందని, అడ్డాలు మారుస్తున్నారు. దీంతో వారు పోలీసులకు చిక్కడం లేదు.
పేకాటకు అలవాటుపడిన వారిలో చాలామంది ఆర్థికంగా చితికిపోతున్నారు. కొందరు అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. వాటిని తీర్చడానికి బంగారం కుదవపెట్టడం, ఆస్తులు అమ్ముకోవడం చేస్తున్నారు. ఉన్న ఆస్తులు కరిగిపోతుండడంతో రోడ్డున పడుతున్నారు. కొందరు పొద్దస్తమానం పేకాటలో నిమగ్నమై కుటుంబాలను పట్టించుకోవడం లేదు. పిల్లల స్కూలు, కాలేజీ ఫీజులు చెల్లించడానికి వారి కుటుంబ సభ్యులు ఇబ్బందిపడుతున్నారు.
జూదం, పేకాట నిర్మూలనకు జిల్లాలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 24 గంటల పాటు నిఘా కొనసాగుతోంది. ఎక్కడ పేకాడుతున్నట్టు సమాచారం అందినా వెంటనే దాడులు చేస్తున్నాం. జూదం ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవు. ప్రజలు పేకాటతో జీవితాలను నాశనం చేసుకోవద్దు. కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలి.
–రాజేశ్చంద్ర, ఎస్పీ, కామారెడ్డి
పండుగ పూట..
దీపావళి పండుగ వస్తుందనగానే పేకాడేవారు జోరు పెంచుతారు. సరదా పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు ఆటలో పెడుతుంటారు. పండుగ సంప్రదాయం అంటూ కొందరు తీన్పత్తాలో పెద్ద మొత్తంలో డబ్బులు తగలేస్తున్నారు. పండుగకు నాలుగైదు రోజుల ముందు మొదలై, పండుగ తరువాత నాలుగైదు రోజుల పాటు కొనసాగనుంది. పోలీసులు దాడులు నిర్వహిస్తున్నా ఆట ఆగడం లేదు. గతేడాది జిల్లాలో 325 పేకాట కేసులు నమోదయ్యాయి. 2,089 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి సుమారు రూ. 38 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈసారి సైతం భారీగానే కేసులు నమోదవుతున్నాయి.


