ప్రాణాలతో చెలగాటం! | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో చెలగాటం!

Nov 7 2026 12:30 AM | Updated on Nov 7 2026 12:30 AM

బయటకు పొక్కకుండా.. భద్రతా ప్రమాణాలు శూన్యం

ఫార్మా, కెమికల్‌ ఫ్యాక్టరీలలో కార్మికుల

ప్రాణాలకు రక్షణ కరువయ్యింది. భద్రత

విషయంలో యాజమాన్యాలు అవసరమైన

చర్యలు తీసుకోకపోవడంతో తరచూ

ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

భిక్కనూరు మండలంలో ఇటీవల ఓ

కంపెనీలో జరిగిన ప్రమాదంలో

కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా ఈనెల 5న జరిగిన ప్రమాదంలో

ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అధికార

యంత్రాంగం సైతం ఆయా కంపెనీలపై

ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం

విమర్శలకు తావిస్తోంది.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : భిక్కనూరు మండలంలో ఐదు ఫార్మా, కెమికల్‌ కంపెనీలున్నాయి. ఐరన్‌, ఇ తర కంపెనీలు పదికిపైగా పనిచేస్తున్నాయి. ఏ ఒక్క దాంట్లోనూ కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లే వు. ఏదైనా ప్రమాదం జరిగినపుడు తక్షణమే వైద్యం అందించే సౌకర్యాలు కూడా లేవని తెలుస్తోంది. ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరిగి కార్మికులు రోడ్డున పడుతున్నా స్థానిక రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం నోరుమెదపడం లేదు.

ఫార్మా, కెమికల్‌ కంపెనీల్లో బాయిలర్లు పేలడం, ఇతర కారణాలతో ప్రమాదాలు సంభవించడం వంటి ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్నాయి. ఆయా ఘటనల్లో కార్మికులు గాయాలపాలవుతున్నారు. అయితే కంపెనీల్లో ఏం జరిగినా బయటకు పొక్కనీయడం లేదు. ఫ్యాక్టరీలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తే విషయం బయటికి తెలుస్తుందన్న ఉద్దేశంతో యాజమాన్యాలు క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలిస్తున్నాయి. చాలా సందర్భాల్లో పోలీసు కేసులు కూడా నమోదు కావడం లేదు. కొన్ని బయటికి తెలిసినా ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనిచేస్తున్న కార్మికుల పక్షాన కొట్లాడేవారు లేకుండాపోయారు. కనీసం మాట్లాడే వారు కరువయ్యారు.

జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించడానికి సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. కార్మికులకు రక్షణ కవచాలు సరిగా ఉండడం లేదని తెలుస్తోంది. ప్రమాదకరమైన పనుల చేసేచోట కార్మికులకోసం గట్టి రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా ఫ్యాక్టరీల్లో అవేవీ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాదాలు జరిగిన ప్రతీసారి కార్మికులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. ప్రమాదాల్లో గాయాలపాలైన వారిని హైదరాబాద్‌కు తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. కంపెనీలు అప్పటికప్పుడు వైద్యం చేయించి చేతులు దులుపుకుంటుండగా.. ప్రమాదాల్లో గాయాలపాలైన కార్మికులు కోలుకోవడానికి సంవత్సరాలు పడుతోంది. దీంతో వారి ఆలనాపాలనా చూసుకునేవారు లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

అటువైపు చూడని యంత్రాంగం...

ఫార్మా, కెమికల్‌ ఫ్యాక్టరీలలో ఏం జరుగుతోంది అన్న విషయాన్ని అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి యాజమాన్యాలను ప్రశ్నించేవారు లేకుండాపోయారు. ప్రమాదకరమైన రసాయనాలు వాడే ఫ్యాక్టరీలను వివిధ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉన్నా.. అటువైపు తొంగిచూడడం లేదన్న విమర్శలున్నాయి. యాజమాన్యాలు అధికారులను మెనేజ్‌ చేయడం వల్లే వారు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైన సమయంలోనైనా యంత్రాంగం స్పందించాలని కోరుతున్నారు.

ఫార్మా, కెమికల్‌ కంపెనీల్లో

కార్మికులకు భద్రత కరువు

ప్రమాదాలతో చితికిపోతున్న బతుకులు

బాధితులను పట్టించుకోని

యాజమాన్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement