సెలవులో కలెక్టర్‌ సంగ్వాన్‌ | - | Sakshi
Sakshi News home page

సెలవులో కలెక్టర్‌ సంగ్వాన్‌

Nov 7 2026 12:30 AM | Updated on Nov 7 2026 12:30 AM

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఐదు రోజుల సెలవుపై వెళ్లారు. ఆయన శుక్రవారంనుంచి 11 వ తేదీ వరకు సెలవులో ఉండనున్నారు. తిరిగి 12న విధుల్లో చేరతారు. దీపావళి పండుగ కోసం సొంతూరికి వెళ్లినట్లు సమాచారం. ఇన్‌చార్జి కలెక్టర్‌గా నిజామాబాద్‌ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి వ్యవహరించనున్నారు.

సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులుగా

సోమాయప్ప స్వామి

నిజాంసాగర్‌: తెలంగాణ సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులుగా బిచ్కుందకు చెందిన సోమాయప్ప స్వామి ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌ కాచిగూడలోని శాం బాబా మందిరంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ మఠాలు, పీఠాలు, సంప్రదాయాలకు చెందిన సాధు సంతులు, స్వామీజీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వామీజీల అభిప్రాయాలు, సూచనల మేరకు నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సోమాయప్ప స్వామీజీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారని విశ్వహిందూ పరిషత్‌ కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు సంగ్రామ్‌ మహరాజ్‌ ప్రకటించారు. నూతన కార్యవర్గం మూడేళ్లపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.

అధికారులను అడ్డుకున్న రైతులు

భిక్కనూరు : గుర్జకుంట శివారులోని సర్వే నంబర్‌ 85లో ఏటీసీ(ఆడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) ఏర్పాటు కోసం హద్దులు నిర్ణయించేందుకు అధికారులు శుక్రవారం గ్రామానికి వచ్చారు. అయితే ఆ భూమిలో తమకు 40 ఏళ్ల క్రితమే పట్టాలు ఇచ్చారంటూ గ్రామానికి చెందిన పుట్ట రమేశ్‌, పుట్ట నర్సింలు వారిని అడ్డుకున్నారు. పుట్ట రమేశ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాననగా.. పోలీసులు వారించారు. రీసర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. కాగా సర్వే నంబర్‌ 85లో 15 ఎకరాల 34 గుంటల భూమి ఉందని, ప్రభుత్వం ఎనిమిది ఎకరాలే రైతులకు ఇచ్చిందని తహసీల్దార్‌ సునీత పేర్కొన్నారు. త్వరలో రీసర్వే చేసి మిగులు భూమిని మాత్రమే సేకరిస్తామన్నారు. దీంతో రైతులు శాంతించారు. అధికారుల వెంట ఎస్సై అనిల్‌, సర్వే బృందం సభ్యులు ఉన్నారు.

జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

కామారెడ్డి టౌన్‌ : వచ్చేనెలలో హైదరాబాద్‌లో నిర్వహించే జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌లో ఏబీవీపీ ఇందూర్‌ విభాగ్‌ ఆధ్వర్యంలో 72వ జాతీయ మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల ప్రాంగణాలను దేశ వ్యతిరేక శక్తుల నుంచి కాపాడిన ఘనత ఏబీవీపీ కార్యకర్తలదేనన్నారు. సమస్యలను కేవలం గోడలపై రాయడమే కాకుండా, రోడ్డెక్కి పోరాడి పరిష్కారాలు సాధించే ఏకై క విద్యార్థి సంఘం ఏబీవీపీ అన్నారు. హైదరాబాద్‌ లో డిసెంబర్‌ 24 నుంచి 27 వరకు నిర్వహించే జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూర్‌ విభాగ్‌ ప్రముఖ్‌ రెంజర్ల నరేష్‌, పూర్వ విభాగ్‌ ప్రముఖ్‌ రంజిత్‌ మోహన్‌, విభాగ్‌ కన్వీనర్‌ శశిధర్‌, జిల్లా ప్రముఖ్‌లు గిరి, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను అధిరోహించిన మారుతి

నవీపేట: నాళేశ్వర్‌కు చెందిన పర్వతారోహకుడు ఆర్మూర్‌ మారుతి శుక్రవారం ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ను అధిరోహించాడు. అక్టోబర్‌ 26న పర్వతారోహణకు వెళ్లిన మారుతి శుక్రవారం గమ్యాన్ని చేరుకున్నాడు. భూ ఉపరితలానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపుపై త్రివర్ణ పతాకంతో అభివాదం చేశాడు. మారుతి 2023 ఆగస్టు 15న కిలిమంజారో (5895 మీ.), 2024 ఆగస్టు 17న యూరప్‌లోని ఎలబరస్‌ (5652 మీ) పర్వతాలను అధిరోహించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement