వాగులో మునిగి ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

వాగులో మునిగి ఒకరి మృతి

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

వేల్పూర్‌: మండలంలోని పచ్చలనడ్కుడ పెద్దవాగులో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మునిగి మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. ధర్పల్లి మండలం హొన్నాజిపేట్‌ గ్రామానికి చెందిన పుట్ట మల్లేష్‌(27), తన అన్నతో కలిసి అర్మూర్‌ మండలం మామిడిపల్లిలో నివాసముంటున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో తిరుగుతూ చెరువుల్లో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలకు వాడిన ఇనుమును సేకరించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఈక్రమంలో గురువారం పచ్చలనడ్కుడ పెద్దవాగులో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాల ఇనుప కడ్డీలు తీసేందుకు సోదరుడు, మరో ఇద్దరు మహిళలు ఆటో తీసుకొని వచ్చారు. విగ్రహాలు నిమజ్జనం చేసిన పెద్దవాగులోకి మల్లేష్‌ వెళ్లి, బయటకు రాలేదు. వెంటనే స్థానికులు వేల్పూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మల్లేష్‌ మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కుమారుడిని హతమార్చిన తండ్రి!

నిజాంసాగర్‌ (జుక్కల్‌): మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగిన తనయుడిని తండ్రి హతమార్చిన ఘటన బిచ్కుందలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చాకలి సురేష్‌ మద్యానికి బానిసై, జులాయిగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తండ్రి శివరాం, తల్లి గంగమణితో అతడు గొడవపడ్డాడు. డబ్బులు లేవని తల్లిదండ్రులు నిరాకరించడంతో సురేష్‌ ఆగ్రహంతో తల్లి గొంతు పట్టి లాగాడు. దీంతో తండ్రి శివరాం కుమారుడి గొంతుకు టవల్‌ చుట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. మరుసటి రోజు మృతుడి సోదరుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తమ్ముడి మృతికి కారణమైన తండ్రిపై, వాస్తవాన్ని దాచిన తల్లిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈమేరకు బిచ్కుంద పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement