బాన్సువాడ: బాన్సువాడ మండలం రాజారాందుబ్బాలో అక్రమంగా దాచి ఉంచిన 75 సిలిండర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘యథేచ్ఛగా రీ ఫిల్లింగ్ దందా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్పందించారు. రాజారాం దుబ్బా కాలనీలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉన్న 68 కమర్షియల్, 7 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డొమెస్టిక్ సిలిండర్ల నుంచి అక్రమంగా కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్‌ను రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు అధికారుల తనిఖీలో వెల్లడయ్యింది. ఎవరైనా రీ ఫిల్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్‌వో రవీందర్ రాథోడ్ హెచ్చరించారు. సమాచారం అందించిన వ్యక్తుల పేర్లు రహస్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు అశోక్, బాలయ్య, జీపీవోలు హర్ష, ఆనంద్, పోలీసు సిబ్బంది ఉన్నారు.


