● క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తాం
● జిల్లా సహకార అధికారి రామ్మోహన్
రామారెడ్డి (ఎల్లారెడ్డి): రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తుందని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ స్పష్టం చేశారు. గురువారం ఆయన రామారెడ్డి మండలం పోసానిపేట్, రామారెడ్డి, ఉప్పల్వాయి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు విక్రయించేందుకు తీసుకొచ్చిన ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించడంతోపాటు కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహణను నిశితంగా పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఏడు రకాల వరి ధాన్యానికి క్వింటాల్‌కు మద్దతు ధర, రూ.500 చొప్పున బోనస్ అందించనున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులు, ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోనే 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయన వెంట క్లస్టర్ అధికారి నాగేశ్, అడ్లూర్ ఎల్లారెడ్డి సహకార సంఘం కార్యదర్శి లింగమూర్తి, రైతులు ఉన్నారు.


