హైరిస్క్‌ గర్భిణులను ముందస్తుగా గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

హైరిస్క్‌ గర్భిణులను ముందస్తుగా గుర్తించాలి

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

హైరిస్క్‌ గర్భిణులను ముందస్తుగా గుర్తించాలి

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో మాతృ మరణాల పూర్తిస్థాయి నివారణే లక్ష్యంగా హైరిస్క్‌ గర్భిణులను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (ఎంసీహెచ్‌) డాక్టర్‌ సుధీర తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశపు హాల్‌లో వైద్యాధికారులు, సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. మహిళ గర్భం దాల్చిన 12 వారాల్లోపు వంద శాతం నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గర్భిణీకి ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు పంపిణీ చేయడంతోపాటు కాన్పు సమయానికి కనీసం తొమ్మిది రకాల వైద్య పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. తీవ్ర రక్తహీనత, అధిక రక్తపోటు (బీపీ), గుండె సంబంధిత సమస్యలు, సికిల్‌ సెల్‌ అనీమియా, గతంలో కాన్పు సమస్యలు ఉన్నవారిని ముందస్తుగానే ‘హైరిస్క్‌’ జాబితాలో చేర్చి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రసవ తేదీకి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని, అత్యవసర వైద్య సదుపాయాలు సమకూర్చుకోవాలని తెలిపారు. డీఎంహెచ్‌వో వెంకటి మాట్లాడుతూ జిల్లాను మాతృ మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. హైరిస్క్‌ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచి, సురక్షిత ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. శిశు వైద్య నిపుణురాలు శిరీష, సీ్త్ర వైద్య నిపుణురాలు సురేఖ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు డాక్టర్‌ సంతోషి, డాక్టర్‌ శర్వాణి పాల్గొని వివిధ వైద్య అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీల వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాతృ మరణాల నివారణకు

పకడ్బందీ చర్యలు చేపట్టాలి

12 వారాల్లోపు వంద శాతం

నమోదు పూర్తి కావాలి

వైద్యారోగ్య శాఖ జేడీ డాక్టర్‌ సుధీర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement