విద్యార్థినుల క్షేమానికే..
● 20 ప్రభుత్వ జూనియర్
కళాశాలల్లో వెండింగ్ మిషన్లు
● బాలికల ఆరోగ్య భద్రతే
లక్ష్యంగా ఏర్పాటు
ఎల్లారెడ్డిరూరల్: బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో సానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేసింది. కళాశాలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా నాప్కిన్ వెండింగ్ మిషన్లు, ఇన్సినరేటర్ యంత్రాలను బిగించింది.
కళాశాలల్లో 3,500 విద్యార్థినులు..
జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో మొత్తం 3,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం కళాశాలల్లో సానిటరీ నాప్కిన్ వెండింగ్, ఇన్సినరేటర్ మిషన్లను ఏర్పాటు చేసింది.
విద్యార్థినులు రుతుక్రమం సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా నాప్కిన్, ఇన్సినరేటర్ మిషన్లు దోహదపడతాయి. మిషన్లలో బటన్ నొక్కగానే ప్యాడ్‌ను పొందవచ్చు. వాడిన ప్యాడ్లను ఇన్సినరేటర్ మిషన్‌లో వేస్తే అది బూడిదగా మారిపోతుంది. ఇటు విద్యార్థినుల సమస్యలు తీరడంతోపాటు పర్యావరణ కాలుష్యం ఏర్పడదు.
20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సానిటరీ నాప్కిన్ వెండింగ్, ఇన్సినరేటర్ మిషన్లు బిగించాం. విద్యార్థినుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యార్థినులు వీటిని జాగ్రత్తగా వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
– సలాం, ఇంటర్మీయెట్ జిల్లా నోడల్ ఆఫీసర్


