యాసంగి సాగు లక్ష్యం 3.36 లక్షల ఎకరాలు | - | Sakshi
Sakshi News home page

యాసంగి సాగు లక్ష్యం 3.36 లక్షల ఎకరాలు

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

● డీఏవో మోహన్‌రెడ్డి

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలో యాసంగి సీజన్‌లో 3 లక్షల 36 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో) మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట శివారులో శశాంక్‌రెడ్డి అనే రైతు సేంద్రీయ పద్ధతిలో సాగుచేస్తున్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌లో భాగంగా రూ.లక్ష విలువ చేసే సామగ్రిని వంద శాతం సబ్సిడీపై రైతుకు అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గతేడాది యాసంగిలో జిల్లాలో 2.55 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారని, కానీ ఈ సంవత్సరం ఎల్‌ నినో పరిస్థితుల దృష్ట్యా వరి సాగును లక్షా 20 వేల 940 ఎకరాలకు కుదించామన్నారు. సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు మాత్రమే వరి వేసుకోవాలని, మిగతా రైతులు తప్పనిసరిగా ఆరుతడి పంటలనే వేసుకోవాలని ఆయన చెప్పారు. జిల్లాలో లక్షా 20 వేల 940 ఎకరాల్లో వరి, 35,334 ఎకరాల్లో మొక్కజొన్న, లక్షా 02 వేల ఎకరాల్లో జొన్న, 62 వేల ఎకరాల్లో శనగ, 4,930 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 1,925 ఎకరాల్లో కుసుమ పంటలు సాగవుతాయని అంచనా వేసినట్లు ఆయన వివరించారు. కాగా వంద శాతం సబ్సిడీపై పొద్దు తిరుగుడు, 90 శాతం సబ్సిడీపై మినుములు, 50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాలను రైతులకు అందజేస్తున్నామన్నారు. ఆగస్టు 14 నుండి ఇప్పటి వరకు వివిధ కారణాల రీత్యా జిల్లాలో 222 మంది రైతులు మరణించారని, వారందరి వివరాలను రికార్డు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డీఏవో వెంట నాగిరెడ్డిపేట ఏవో సాయికిరణ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement