● తండ్రి జ్ఞాపకంగా కూతురు
కట్టించిన బడి ప్రారంభం
● అభినందించిన అధికారులు,
ప్రజాప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తండ్రి జ్ఞాపకార్థం సమాజానికి మేలు చేయాలన్న సంకల్పం గొప్పదని పలువురు పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్ ప్రాథమిక పాఠశాలలో దివంగత అమరేశం రాజేశ్వరశర్మ జ్ఞాపకార్థం ఆయన కూతురు శ్రీవారి భారతి ఎస్‌సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో రూ.22 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, డీఈవో మల్లికార్జున్, కౌన్సిలర్ వినోద తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తండ్రి పేరుతో భవనం నిర్మించడం గొప్ప విషయమని అభినందించారు. అనంతరం భవన నిర్మాణ దాత శ్రీవారి భారతి మాట్లాడుతూ.. నాన్నగారి జ్ఞాపకార్థం పాఠశాల భవనం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పేద పిల్లలకు విద్యనందించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో గంగాకిషన్, జంగం శ్రీశైలం, చంద్రశేఖర్‌గౌడ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


