కామారెడ్డి టౌన్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 23వ రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో చేపడుతున్న శిబిరంలో గొడ్డుకారం అన్నం తింటూ ప్రభుత్వానికి తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. శిబిరాన్ని సీపీఐ(ఎంఎల్), టీయూ సీఐ నాయకులు రామకృష్ణ, రమేశ్, ప్రకాశ్ సందర్శించి మద్దతు ప్రకటించారు. జిల్లా జనచైతన్య కళాకారుల సంఘం అధ్యక్షుడు కాసల మోహన్ యాదవ్, నాయకులు రాము పటేల్, బిట్ల సురేందర్, మైనుద్దీన్, లింగాల యాదా గౌడ్, లక్ష్మణ్ ఆట పాటలతో ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు.
కామారెడ్డి రూరల్: మండలంలోని ఇస్రోజీవాడీ గ్రామం కేంద్ర ప్రభుత్వ పీఎంఏజేవై (ప్రధానమంత్రి అనుసూచిత కులాల అభ్యుదయ్ యోజన) పథకం సర్వేకు ఎంపికై ంది. దీంతో సర్పంచ్ చిందం మల్లేశ్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో సర్వే కార్యక్రమం ప్రారంభమైందని, సర్వే ద్వారా కుటుంబాల పరిస్థితులు, మౌలిక సదుపా యాలు, అభివృద్ధి అవసరాలను గుర్తించడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. గ్రామస్తులు సర్వే బృందానికి సహకరించి సరైన వివరాలు అందించాలని కోరారు.
ఉపాధ్యాయుల
ఉమ్మడి సర్వీస్ రూల్స్ తేవాలి
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు ఉమ్మడి సర్వీస్ నిబంధనలు రూపొందించి, ఎంఈవో, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో డీఈవోకు వినతిప్రతం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం తక్షణమే సీపీఎస్ రద్దు కోసం అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ కలీమొద్దీన్, ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర బాధ్యుడు పోల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్: మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లిలో బుధవారం సర్పంచ్ సాయిలు పశువులకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. పెంపకందారులు పశువులకు టీకాలు వేయించాలన్నారు. పశు సంవర్ధక సిబ్బంది, రైతులు ఉన్నారు.
బాన్సువాడ: బాన్సువాడలోని హరిజనవాడలో మంగళవారం రాత్రి తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. హరిజనవాడకు చెందిన ప్రసన్న అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి నిజామాబాద్‌కు వెళ్లారు. రాత్రి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిన దుండగులు బీరువాలో ఉన్న 5 మాసాల బంగారం, 17 తులాల వెండి ఎత్తుకెళ్లారు. బాధిడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీధర్ తెలిపారు.
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని పలు బి య్యం దుకాణాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆర్‌ఐ అశోక్ మాట్లాడుతూ బియ్యం కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీ సుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించా లని సూచించారు.
పేకాట స్థావరంపై దాడి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని కాకతీయనగర్‌లో పేకాటస్థావరంపై దేవునిపల్లి పోలీసులు దాడి చేశారు. దాడిలో ఆరుగురిని అరెస్టు చేయగా వారి నుంచి రూ. లక్ష40వేల నగదు, స్కూటీ, పేకముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.
లింగంపేటలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జల్దిపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై బుధవారం దాడి చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. జల్దిపల్లి శివారులో పేకాడుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ. 44,840 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 7 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాడిన వారిపై కేసు నమోదు చేశామన్నారు.


