● డొమెస్టిక్ నుంచి కమర్షియల్‌కు..
● కొరత సృష్టిస్తూ అధిక ధరలకు గ్యాస్
సిలిండర్ల విక్రయాలు
● పట్టించుకోని అధికార యంత్రాంగం
బాన్సువాడ : జిల్లాలోని సబ్సిడీ గ్యాస్ రీ ఫిల్లింగ్ దందా జోరుగా సాగుతోంది. జనావాసాల మధ్య అక్రమదందా నడుస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. డొమెస్టిక్ నుంచి కమర్షియల్, మినీ సిలిండర్లలో రీ ఫిల్లింగ్ చేస్తున్నారు. పౌర సరఫరాల అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో దందా జోరుగా సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఒక్క బాన్సువాడ పట్టణంలోనే ఐదు చోట్ల రీ ఫిల్లింగ్ జరుగుతున్న సమాచారం. పలువురు గ్యాస్ డెలివరీ బాయ్స్ సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కమర్షియల్ ధర రెండింతలు
జిల్లాలో డొమెస్టిక్ 14.5 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1012, కమర్షియల్ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.3096 ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రెండింతలు ఎక్కువగా ఉండటంతో రీ ఫిల్లింగ్ దందాకు తెరలేపుతున్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ల నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌లో రీ ఫిల్లింగ్ చేస్తున్నారు. మినీ సిలిండర్లను సైతం డొమెస్టిక్ సిలిండర్ల నుంచే ఫిల్లింగ్ చేసి విక్రయిస్తున్నారు. డొమెస్టిక్ నుంచి చిన్న గ్యాస్ సిలిండర్లలో కేజీ రూ.200 చొప్పున, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లలో నింపి రూ.2500 నుంచి రూ.3100 వరకు విక్రయిస్తున్నారు.
ఆఫర్లు ఇస్తూ..
గ్యాస్‌ను తక్కువగా వినియోగించుకునే వారిని గ్యాస్ డెలివరీ బాయ్స్, ఏజెన్సీ నిర్వాహకులు గుర్తించి వారితో గ్యాస్ బుక్ చేయిస్తున్నారు. ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీ మీరే తీసుకోవాలని వినియోగదారులకు గాలం వేస్తున్నారు. అలా వచ్చిన గ్యాస్ సిలిండర్‌ను రీ ఫిల్లింగ్, వాణిజ్య అవసరాలకు వినియోగించుకునే వారికి డిమాండ్ మేరకు రూ.2500 నుంచి రూ. 3 వేల వరకు విక్రయిస్తున్నారు. జనావాస ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ అక్రమ దందాపై ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.


