కామారెడ్డి టౌన్: జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘అన్నపూర్ణ సేవారథం’ ద్వారా ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుటుంబసభ్యులు మరణించిన సమయంలో అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రులకు భోజన ఏర్పాట్లు చేయడం ఆ కుటుంబాలకు మరింత భారంగా, ఇబ్బందికరంగా మారకూడదనే ఉద్దేశంతో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు ట్రస్ట్‌కు సమాచారం అందిస్తే, నేరుగా వారి ఇంటి వద్దకే అన్నపూర్ణ సేవారథం ద్వారా ఉచితంగా భోజనాన్ని చేరవేస్తామని వివరించారు. ఈ సేవలు అవసరమైన వారు 9536000333 నంబర్‌ను సంప్రదించాలన్నారు. అనంతరం కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు, కౌన్సిలర్ గడ్డమీది మహేశ్, నాయకులు తాటి ప్రసాద్, పంపరి లక్ష్మణ్, మెహర్ బాబాగౌడ్, జమీల్, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, రంగా రమేశ్ గౌడ్, మాధవి, శ్రీధర్ రావు, బండారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


