సదాశివనగర్/ కామారెడ్డి రూరల్: రైతులు తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సదాశివనగర్ ఎంపీడీవో సంతోష్ కుమార్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎల్‌నినో పై మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. తక్కువ నీటితో పండే శనగ, సజ్జ, జొన్న, కుసుమ, పెసర, మినుము పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి రైతు వేదికలో గ్రామస్తులతో అధికారులు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో హెప్సిబారాణి, వీబీజీరామ్‌జీ ఏపీవో అన్నపూర్ణ పాల్గొని ఎల్‌నినో ప్రభావం, దాని వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు, గ్రామంలో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ అడపా శ్యామ్, జీపీ కార్యదర్శి చంద్రకళ, వీబీజీరామ్‌జీ టెక్నికల్ అసిస్టెంట్, జీపీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


