లక్ష్మణచాంద: సరస్వతి కాలువ వెంట మోటార్లకు సంబంధించిన విద్యుత్తు వైర్లను దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రైతులు చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన రైతులు కొత్తగొల్ల భోజన్న, బర్మ లక్ష్మణ్ సరస్వతి కాలువలోని మిగులు నీటిని వినియోగించుకుంటూ విద్యుత్తు మోటార్ల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. మంగళవారం ఉదయం సోన్ మండలం కడ్తాల్ సమీపంలో సరస్వతి కాలువపై రైతులకు చెందిన మోటార్ల వైర్లను దొంగిలించి పరారవుతున్న ఇద్దరు దుండగులను రైతు గుర్రం లింగన్న, మరో ఇద్దరు రైతులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితులను సోన్ మండలంలోని న్యూ బొప్పారం గ్రామానికి చెందిన కుంచపు లక్ష్మణ్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన గుపాల్వాడ్ శ్రీనివాస్గా గుర్తించారు. వీరు గతంలో చోరీ కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బయటికి వచ్చారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గోపి తెలిపారు.


