మార్కెట్లో ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. ఎవరిని కదిలించినా డబ్బులు సర్దుబాటు కావడం లేదనే మాట వస్తోంది. అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నారు. వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ దందా చేసేవారు కొంత కాలంగా అప్పులు ఇవ్వడం తగ్గించుకుంటూ వస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇటీవలి కాలంలో ఏ వ్యాపారిని అడిగినా డబ్బులు దొరకవు అనే సమాధానం వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. దీంతో పేదలే కాదు మధ్యతరగతి వర్గాలు కూడా అవసరానికి డబ్బులు దొరక్క అవస్థలు పడుతున్నారు.
అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారంటూ పోలీసులు వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహించిన తరువాత చాలామంది తమ దందాను పక్కనపెట్టేశారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగా, మరికొందరు ఇతర రంగాలవైపు మళ్లారు. బంగారం ధరలకు రెక్కలు వస్తున్న సమయంలో కొందరు వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ నిర్వాహకులు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. ఊహించినట్టే బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో మంచి లాభాలు వచ్చాయి. ఇటీవల ధరలు తగ్గినప్పటికీ పెద్దగా నష్టపోయే పరిస్థితి లేదంటున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినా కొన్నాళ్లకు మళ్లీ పెరుగుతాయని, పెట్టుబడికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని వారు పేర్కొంటున్నారు. వడ్డీ ఆశతో అప్పులు ఇచ్చి ఇబ్బందుల్లో పడేకన్నా బంగారం కొనుగోలు చేసి, లాకర్లలో భద్రపరచుకోవడమే ఉత్తమమనే భావనతో చాలా మంది ఉన్నారు. అప్పట్లో వెండి కూడా కిలోల కొద్దీ కొనుగోలు చేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు మాత్రమే కొంత సులువుగా లభిస్తాయి. హౌజింగ్ లోన్స్ తీసుకుందామంటే ఇన్‌కం ట్యాక్స్ లెక్కలు చూపాల్సి ఉంటుంది. ఉద్యోగులు, పెద్ద వ్యాపారులు మాత్రమే ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తుంటారు. సామాన్యులకు అది సాధ్యమయ్యేది కాదు. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని వారు ప్రైవేట్ ఫైనాన్స్‌లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. గతంలో అవసరం ఉందని ఎవరిని అడిగినా అప్పులు ఇచ్చేవారు. ఈ మధ్య దోస్తులు, బంధువులు అప్పు అడిగితే మాట దాటేస్తున్నారు. పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు, వివాహాది శుభకార్యాల సమయంలో అప్పులు పుట్టడం లేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరాలు ఏర్పడితే ఇంట్లో బంగారం ఉంటే బ్యాంకుల్లో తనఖా పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటున్నామని చెబుతున్నారు.
పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఉండి, ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితుల్లో కొందరు తమ ఇళ్లను తాకట్టు పెడుతున్నారు. మార్కెట్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు హౌజింగ్ లోన్ సంస్థలు విరివిగా రుణాలు ఇస్తున్నాయి. పాత ఇళ్లపైనా రుణాలు ఇస్తుండడంతో చాలా మంది అప్పుల కోసం తప్పనిసరై తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారు. అయితే ప్రైవేటు హౌజింగ్ లోన్స్‌పై అడ్డగోలు వడ్డీలు తరువాత భారంగా మారుతున్నాయి. ఇప్పటికే చాలా మంది హౌజింగ్ లోన్లు తీసుకుని ఆగమవుతున్నారు.
ఇటీవల కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి తన కూతురు వివాహానికి డబ్బులు అవసరం అయి తెలిసిన వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాడు. అయితే ఎవరిని అడిగినా డబ్బులు లేవన్న సమాధానమే వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి లోన్ తీసుకుని శుభకార్యం జరిపించాడు. ఇలా సమయానికి అప్పులు దొరక్క చాలామంది ఇబ్బందిపడుతున్నారు.
వడ్డీ వ్యాపారుల దృష్టికోణం మారిపోయింది. అప్పులిచ్చి ఆపై వసూళ్ల కోసం ఇబ్బందిపడేకన్నా.. బంగారంపై పెట్టుబడి పెట్టడం ఉత్తమమని భావిస్తున్నారు. ప్రస్తుతం ధర తగ్గుతున్నా.. ఎప్పటికై నా పెరగాల్సిందేనన్న ఆశావహ దృక్పథంతో బంగారం కొంటూ పోతున్నారు. దీంతో మార్కెట్లో అప్పుదొరక్క సామాన్యులు అవస్థలు పడుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
మారిన వడ్డీ వ్యాపారుల దృష్టి
అప్పులు ఇచ్చేందుకు వెనుకంజ
బంగారంపై పెట్టుబడులకు మొగ్గు
అవసరానికి అప్పులు దొరక్క
అవస్థలు పడుతున్న సామాన్యులు


