బల్దియాలో అక్రమాలపై కలెక్టర్‌ సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

బల్దియాలో అక్రమాలపై కలెక్టర్‌ సీరియస్‌

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

బల్దియాలో అక్రమాలపై కలెక్టర్‌ సీరియస్‌

అవినీతిని ఉపేక్షించేది లేదు : కలెక్టర్‌

● విచారణ జరపాలని

అదనపు కలెక్టర్‌కు ఆదేశం

● ‘సాక్షి’ కథనాలతో స్పందన

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీలో అవకతవకలు, కొందరు కౌన్సిలర్ల అక్రమ వసూళ్లు, టేక్రియాల్‌ చెరువులోంచి స్క్రాప్‌ మాయమైన ఘటనలపై కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సీరియస్‌ అయ్యారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరిని ఆదేశించారు. బల్దియాలో పాత సామగ్రి దొంగతనాలు, పట్టణంలో అక్రమ వసూళ్లుపై ‘సాక్షి’ దినపత్రికలో గతనెల 29న ‘బల్దియాలో ఇంటి దొంగలు’ ఈనెల 2న ‘పురంలో వసూళ్ల పర్వం’ శీర్షికన కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనాలపై స్పందించిన జిల్లా పాలనాధికారి విచారణకు ఆదేశించారు.

విచారణ చేపట్టిన అదనపు కలెక్టర్‌

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి మంగళవారం విచారణ చేపట్టారు. మున్సిపల్‌ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంజినీరింగ్‌ విభాగం చేపట్టిన టెండర్ల ప్రక్రియ, టేక్రియాల్‌ చెరువులో నిమజ్జనం చేసిన విగ్రహాల తాలూకు ఇనుమ సామగ్రి, పారిశుద్ధ్య సిబ్బంది నియామకాలు, వారి హాజరు, వేతనాల చెల్లింపుల్లో జరిగిన గోల్‌మాల్‌పై ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పనుల్లో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల జోక్యంపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపనున్నారు. అలాగే టౌన్‌ ప్లానింగ్‌ విభాగం జారీ చేసిన నోటీసులు–తీసుకున్న చర్యలు, కౌన్సిల్‌ నెలవారీ సమావేశాల నిర్వహణ, గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం కోసం కొనుగోలు చేసిన ఇనుప సామగ్రి వినియోగం, అనంతరం వాటి విక్రయాలపై విచారణ చేపట్టనున్నారు. మున్సిపల్‌ వాహనాల నెలవారీ ఇంధన వినియోగం, వ్యాపార ట్రెడ్‌ లైసెన్స్‌లు, ఇంటి పన్ను మదింపు తదితర అంశాలపైనా లోతుగా పరిశీలించి నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నారు.

మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అందించే సేవల విషయంలో ఎలాంటి అవకతవకలు, అక్రమ వసూళ్లకు పాల్పడినా ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ హెచ్చరించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులైన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్‌ సేవల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేసినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు ఆధారాలతో నేరుగా అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో గానీ, కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని, మున్సిపల్‌ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement