దోమకొండ: రైతుల ధాన్యాన్ని కొనుగొలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని డీఆర్డీవో దామోదర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని సీతారాంపూర్, సీతారాంపల్లి, లింగుపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. దళారులకు ధాన్యం అమ్మితే మోసపోతారని, మద్దతు ధర అందదని పేర్కొన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను వెంటవెంటనే గోదాంలకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఐకేపీ డీపీఎంలు సాయిలు, సురేష్ కుమార్, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు, సెంటర్ సిబ్బంది ఉన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లా పౌర సరఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారులు మంగళవారం పట్టణంలోని పలు హోల్‌సేల్, రిటైల్ బియ్యం దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. బియ్యం ప్యాకెట్లపై తయారీదారు చిరునామా, కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ ముద్రించకపోవడాన్ని గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను సుభాష్ రోడ్డులోని జై సంతోషిమాత కిరాణా, జేపీఎన్ రోడ్డులోని లక్ష్మి సాయి కిరాణా దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యాన్ని విక్రయించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు నిత్యావసరాలు న్యాయమైన ధరలకే అందేలా వ్యాపారులు సహకరించాలని, ప్యాకింగ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
కామారెడ్డి అర్బన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు విద్యుత్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్–2) నిజామాబాద్ చైర్మన్ కిషన్ సూచించారు. మంగళవారం కామారెడ్డి ఎస్‌ఈ కార్యాలయం వద్ద విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ కిషన్, సభ్యులు శేషారావు, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. తాడ్వాయి, కామారెడ్డి, రాజంపేట, రామారెడ్డి మండలాలకు చెందిన వినియోగదారుల వివిధ సమస్యలపై 14 ఫిర్యాదులను అందించారు. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి శంకర్‌రావు, ఆయా మండలాల నాయకులు చిన్న అంజన్న, భైరవరెడ్డి, విఠల్‌రెడ్డి, సాయిలు రైతుల విద్యుత్ సమస్యలను వివరించారు. వాటిని పరిష్కరించాలని వేదిక సభ్యులు అధికారులను ఆదేశించారు. రైతులు అక్రమంగా విద్యుత్ వినియోగించవద్దని, నామమాత్ర రుసుంతో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే కనెక్షన్ ఇస్తారని పేర్కొన్నారు. ఎస్‌ఈ సాలియానాయక్, ఏడీఈ మల్లేష్, ఏఈలు వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. రిలయన్స్ జియోలో నెట్‌వర్క్‌లో 20 డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డిప్లొమా ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. అర్హులైనవారు శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ మొదటి అంతస్తులోని 121వ గది నంబర్‌లోగల ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని, పూర్తివివరాల కోసం 92818 64678, 63057 43423 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


