కామారెడ్డి టౌన్ : బల్దియాలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మంగళవారం అదనపు కలెక్టర్ ఎన్‌వై గిరికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెలలో జరిగిన వినాయక, దుర్గామాత నిమజ్జనాల అనంతరం మిగిలిన ఇనుప స్క్రాప్, విగ్రహాల స్టాండ్లు, ఇతర సామగ్రిని మున్సిపల్ కౌన్సిల్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా విక్రయించారని ఆరోపించారు. పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీ సర్వే నంబర్ 218, 219 (ఎల్‌పీ నం.135/1985) పరిధిలోని 1.07 ఎకరాల మున్సిపల్ ఓపెన్ స్థలాన్ని కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని వెంటనే కూల్చివేసి ప్రభుత్వ ఆస్తిని రక్షించాలని కోరారు. కమిషనర్ చాంబర్‌లోని సీసీ కెమెరాల వాయిస్ రికార్డింగ్ ద్వారా కౌన్సిలర్లు మాట్లాడే మాటలను రికార్డు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీసీ కెమెరాల యాక్సెస్ అంతా మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త వద్దే ఉందని, గతంలో ఆయన కౌన్సిలర్లకు పంపిన సందేశాల ఆధారాలను కలెక్టర్‌కు అందజేశామని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై తక్షణమే మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అర్కల ప్రభాకర్‌యాదవ్, మిర్జా అఫీజ్, లక్ష్మీనారాయణ, గోపు బాలమణి, లక్ష్మణ్, లోలం శ్రీనివాస్, కోఆప్షన్ మెంబర్ కుంబాల రవి తదితరులున్నారు.


