పిట్లం/ కామారెడ్డి రూరల్: ఎల్‌నినో నేపథ్యంలో గ్రామాల్లో నెలకొనే సమస్యలపై అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ మహేందర్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పిట్లం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావరిత్యా రాబోయే రోజులలో నీటి కొరత ఏర్పడనుందని, నీరు వృథా కాకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని జీపీ కార్యదర్శులను ఆదేశించారు. నీటి పైప్‌లైన్‌లు ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు. విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు విద్యుత్తును అవసరం ఉన్నంతవరకే వాడుకోవాలన్నారు. జీపీల్లో నీటి వృథా జరిగితే కార్యదర్శులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎంపీడీవో సాయన్న, అధికారులు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలంలోని లింగాయపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో గ్రామస్తులకు వివరించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, సోక్‌పిట్లు నిర్మించుకోవాలని సూచించారు. సర్పంచ్ రాజయ్య, ఉపసర్పంచ్ శిరీష, జీపీ కార్యదర్శి నవనీత, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


