● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణిలో 71 ఫిర్యాదుల స్వీకరణ
కామారెడ్డి టౌన్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదునూ క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 71 అర్జీలు రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ, సమస్యల పరిష్కారంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి పాండు, జడ్పీ సీఈవో చందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మల్కాపూర్ (కే) గ్రామాన్ని
కరువు ప్రాంతంగా ప్రకటించాలి
పెద్దకొడప్‌గల్ మండల రెవెన్యూ శివారును ఆనుకుని ఉన్న మల్కాపూర్(కే) గ్రామాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని గ్రామ రైతులు కోరారు. ఈమేరకు వారు కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పాలనాపరమైన ఇబ్బందులను తొలగించేందుకు మల్కాపూర్(కే) గ్రామాన్ని వెంటనే పెద్దకొడప్‌గల్ మండలంలో విలీనం చేయాలని, గ్రామాన్ని కరువు ప్రాంతంగా గుర్తించి తక్షణమే రైతులకు న్యాయం చేయాలని కోరారు.
డ్రెయినేజీ సమస్యను పరిష్కరించాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మత్తడికింది పల్లెకాలనీలో డ్రెయినేజీ సమస్య పరిష్కరించాలని స్థానికుడు శ్రావణ్‌కుమార్ కోరారు. ఈమేరకు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ఫిర్యాదు అందజేశారు. మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాస్థాయి ప్రజావాణిలో విన్నవించినట్లు తెలిపారు.


