నవీపేట: ట్రాక్టర్ ఢీకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మృతి చెందిన ఘటన నవీపేట మండలం గాంధీనగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన పోతిరెడ్డి మల్లీశ్వరి(40) భర్త పోతిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి పొలం పనుల నిమిత్తం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో జన్నేపల్లి నుంచి నవీపేట వైపు వేగంగా వస్తున్న ట్రాక్టర్ మల్లీశ్వరిని ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్ రూరల్: కుటుంబ విభేదాలు, పాత కక్షలతో బావపై బావమరిది దాడి చేసిన ఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ శివారులో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరేంద్రనాథ్, అనిల్ వరుసకు బావబావమరుదులు. ఇద్దరూ ఖానాపూర్ శివారులోని ఓ గోదాంలో పనిచేస్తున్నారు. పాత గొడవలను మనసులో ఉంచుకొని సోమవారం అనిల్ తన బావ వీరేంద్రనాథ్‌పై దాడికి తెగబడ్డాడు. కూరగాయలు కోసే కత్తితో చెవి, మెడ, భుజాలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వీరేంద్రనాథ్‌ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గోదాం మేనేజర్ సుంకాజీ సంతోష్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.


