● బియ్యం దారిలోనే
కూరగాయలు, పప్పుదినుసులు
● ఆందోళన చెందుతున్న సామాన్యులు
ఎల్లారెడ్డిరూరల్: నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. బియ్యం ధరల దారిలోనే కూరగాయలు పయనిస్తున్నాయి. పప్పుదినుసులూ పెరుగుదల బాటలోనే ఉన్నాయి. రెండు నెలల వ్యవధిలో సన్నబియ్యం ధరలు క్వింటాలుకు రూ. 2 వేలపైనే పెరిగాయి. బీపీటీ క్వింటాలు ధర రూ. 8 వేలు కాగా.. హెచ్‌ఎంటీ రూ. 8,500, జైశ్రీరాం రూ. 9,600 లకు చేరాయి. పామాయిల్ లీటర ధర రెండు నెలల క్రితం రూ. 140 ఉండగా.. ఇప్పుడు రూ. 160కు, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ. 160 నుంచి రూ. 175 కు పెరిగింది. పెసరపప్పు ధర కిలోకు రూ. 100 నుంచి రూ. 120కి, కందిపప్పు రూ. 110 నుంచి రూ. 135కు పెరిగాయి. కిలో టమాట ధర రూ. 40 ఉంది. చిక్కుడుకాయ, కాకరకాయ, క్యాప్సికం, పాలకూర, బెండకాయ, వంకాయ ధరలు కిలోకు రూ. 80 కి, క్యారెట్, పచ్చిమిర్చి ధరలు కిలోకు రూ. 100 కు చేరాయి. మార్కెట్‌లో వెల్లుల్లి కిలో రూ. 250, అల్లం రూ. 160, ఉల్లిగడ్డ రూ. 70 అమ్ముతున్నారు. వంట నూనె ప్యాకెట్ల ధర కూడా పెరిగింది. పెరుగుతున్న ధరలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


