ఫోన్ల రికవరీలో జిల్లా నంబర్‌ వన్‌ | - | Sakshi
Sakshi News home page

ఫోన్ల రికవరీలో జిల్లా నంబర్‌ వన్‌

Nov 3 2026 1:15 AM | Updated on Nov 3 2026 1:15 AM

ఫోన్ల రికవరీలో జిల్లా నంబర్‌ వన్‌

ఫోన్‌పోతే వెంటనే ఫిర్యాదు చేయండి

● ఇప్పటివరకు రూ. 9.08 కోట్ల

విలువైన 5,678 ఫోన్ల రికవరీ..

● ఎస్పీ రాజేశ్‌ చంద్ర

కామారెడ్డి టౌన్‌: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను రికవరీ చేయడంలో జిల్లా ముందుంది. పోలీస్‌ కమిషనరేట్లను మినహాయిస్తే జిల్లాల విభాగంలో కామారెడ్డి అగ్ర స్థానంలో ఉందని ఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత డిజిటల్‌ కాలంలో మొబైల్‌ ఫోన్లలో కీలకమైన డేటా, బ్యాంకింగ్‌ వివరాలు, వ్యక్తిగత సమాచారం ఉంటుండడంతో ఫోన్లు పోయినప్పుడు బాధితుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఫోన్ల రికవరీ కోసం ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌ పర్యవేక్షణలో, ఆర్‌ఎస్సై బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందం అత్యాధునిక సాంకేతికతతో ప్రతినెలా సగటున 150కిపైగా ఫోన్లను స్వాధీనం చేసుకుంటోందని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 45 రోజుల్లోనే రూ. 42.24 లక్షల విలువైన 264 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 2.23 కోట్ల విలువైన 1,397 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఈఐఆర్‌ పోర్టల్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 5,678 ఫోన్లను గుర్తించి, సుమారు రూ. 9.08 కోట్ల విలువైన మొబైళ్లను బాధితులకు అప్పగించి రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌గా నిలిచామని తెలిపారు.

మొబైల్‌ ఫోన్‌ పోయిన వెంటనే ఆందోళన చెందకుండా అప్రమత్తమై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. వెంటనే సిమ్‌ కార్డును బ్లాక్‌ చేయించి, సీఈఐఆర్‌ పోర్టల్‌లో ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్‌ చేయాలని కోరారు. పోయిన ఫోన్ల ద్వారా సైబర్‌ నేరాలు జరిగే ప్రమాదం ఉన్నందున అనుమానాస్పద లింకులు, కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలన్నారు. రికవరీ అయిన తమ మొబైల్‌ ఫోన్లను తీసుకునేందుకు బాధితులు తగిన ధ్రువపత్రాలతో జిల్లా పోలీస్‌ కార్యాలయంలోగాని, 87126 86114 నంబర్‌లోగానీ సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement