ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలమట్టం వివరాలు
వేలాదిగా ఎత్తిపోతున్న బోర్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లాలో కొన్ని మండలాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో 33 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, నీటి కటకట తీవ్రమైంది. పెద్దకొడప్గల్ మండలంలో 29 శాతం లోటు వర్షం కురవగా, పశువులకు గ్రాసంతోపాటు తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. బీబీపేట మండలంలో 15 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా ఆయా గ్రామాల్లో భూగర్భ జల మట్టం వేగంగా పడిపోతోంది. దోమకొండ, మాచారెడ్డి, సదాశివనగర్, పాల్వంచ, రామారెడ్డి, కామారెడ్డి, రాజంపేట, తాడ్వాయి, లింగంపేట, గాంధారి, జుక్కల్, బిచ్కుంద, మహ్మద్‌నగర్, పిట్లం తదితర మండలాల్లో సరైన వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంటలు నిండలేదు. చాలాచోట్ల భూగర్భ జల మట్టం పడిపోయి బోర్లు ఎత్తిపోయాయి. జిల్లాలోని చాలా మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ జుక్కల్, పెద్దకొడప్గల్, సదాశివనగర్, మహ్మద్‌నగర్‌లను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు. దీంతో ఏ లెక్కన కరువు మండలాలను ఎంపిక చేశారో అధికారులకే తెలియాలని ప్రజలు విమర్శిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 33 మండలాలు ఉండగా తొమ్మిది మండలాల్లో 30 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. మరో తొమ్మిది మండలాల్లో 20 శాతానికి పైగా లోటు వర్షం కురిసింది. మిగతా మండలాల్లో ఐదు శాతం నుంచి 19 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దాదాపు జిల్లా అంతటా తక్కువ వర్షం కురిసింది. జిల్లాలో సరాసరిగా 20.9 శాతం లోటు ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
నివారణ చర్యలు చేపట్టాలి
ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో భూగర్భ జల మట్టం పడిపోయింది. యాసంగి పంటలు పండే పరిస్థితులు లేవు. చాలాచోట్ల కనీసం పశువులకు తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు చొరవ చూపి కరువు మండలాలుగా ఎంపిక చేయడానికి ప్రయత్నించాలని రైతులు కోరుతున్నారు.
దిగువకు ‘గంగ’
జిల్లాలోని కొన్ని మండలాల్లో భూగర్భ జల మ ట్టం వేగంగా పడిపోయి పాతాళానికి చేరింది. భిక్కనూరు మండలం మల్లుపల్లి, బిచ్కుంద మండలం గుండెనెమ్లి, పెద్దదగ్గి, దోమకొండ మండలం దోమకొండ, అంబర్‌పేట, గాంధారి మండలం సర్వాపూర్, గాధారి, గుర్జాల్, రాంల క్ష్మన్‌పల్లి, లింగంపేట మండలం భవానీపేట, క న్నాపూర్, మోతె, పర్మల్ల, మాచారెడ్డి మండ లం రాజఖాన్‌పేట, మద్నూర్ మండలం మ ద్నూర్, మేనూర్, సోమూర్, రామారెడ్డి మండ లం రెడ్డిపేట తదితర గ్రామాల పరిధిలో భూగర్భ జల మట్టం వేగంగా పడిపోతోంది.
అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంది. ఈ ఏడాది భారీ వర్షాలు కురవకపోడంతో ప్రాజెక్టులు,
చెరువులు, కుంటలు కూడా నిండలేదు. ఖరీఫ్ సీజన్ చివర్లో భూగర్భ జలాల సమస్యకు తోడు కరెంటు సమస్య పంటలను దెబ్బతీసింది. అయితే
ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో నిజామాబాద్ జిల్లాలో 18 మండలాలు, కామారెడ్డి జిల్లాలో నాలుగు మండలాలకు మాత్రమే చోటు దక్కింది.
పాతాళానికి చేరుతోన్న
భూగర్భ జల మట్టం
ఇప్పటికే ఎత్తిపోయిన వేలాది బోర్లు
సగానికి పైగా ఎండిన చెరువులు
కరువు కోరల్లో ఉమ్మడి జిల్లా
ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలమట్టం పడిపోతున్న కొద్దీ బోరుబావుల్లో ఊటలు తగ్గిపోయి క్రమంగా ఎత్తిపోతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, పాల్వంచ, రాజంపేట, తాడ్వాయి, సదాశివనగర్, గాంధారి, లింగంపేట, పిట్లం, పెద్దకొడప్గల్, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, డోంగ్లీ మండలాలతోపాటు బాన్సువాడ మండలంలోని గట్టుకింది గ్రామాల పరిధిలో భూగర్భ జలమట్టం పడిపోతోంది. దీంతో వేలాది బోర్లు ఎత్తిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క కామారెడ్డి జిల్లాలో పది రోజుల క్రితం వరకు 1,100 బోర్లు ఎత్తిపోయాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడం, నీటి వాడకం పెరిగిన నేపథ్యంలో మరిన్ని బోర్లు ఎత్తిపోవచ్చని అంచనా. నిజామాబాద్ జిల్లాలో కూడా వేలాది బోర్లు ఎత్తిపోతున్నాయి.


