● 10 తులాల బంగారం,
50 తులాల వెండి స్వాధీనం
● వివరాలు వెల్లడించిన బిచ్కుంద సీఐ
మద్నూర్(జుక్కల్): మద్నూర్, మేనూర్‌లో చోరీలకు పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు బిచ్కుంద సీఐ రవికుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం మద్నూర్, మేనూర్‌లో ఒకేరోజు జరిగిన వరుస చోరీ కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 4న మద్నూర్‌లో ఒక ఇల్లు, మేనూర్‌లో మూడు ఇళ్లలో ఒకే రాత్రి వరుస చోరీలు జరిగాయి. చోరీలో భారీగా బంగారం, వెండి వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లారు. సీఐ రవికుమార్, ఎస్సై మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతోపాటు, సరిహద్దులోని మహారాష్ట్రలో విచారణ చేపట్టగా బస్మాత్‌కు చెందిన గుండెవార్ కరణ్, శైలేష్ బాబా, రాహుల్ ఎల్లప్పగా పోలీసులు గుర్తించారు. వీరికి శివ ఎల్లప్ప అనే వ్యక్తి సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నలుగురు నిందితుల్లో శైలేష్ బాబా, రాహుల్ ఎల్లప్పలను గతంలోనే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు గుండెవార్ కరణ్, శివ ఎల్లప్పలు ఈ ప్రాంతంలో మరోసారి చోరీ చేయడానికి వస్తుండటంతో మండలంలోని సలాబత్‌పూర్ వద్ద పోలీసులు మాటు వేసి పట్టుకొని అరెస్ట్ చేసినట్లు వారు వివరించారు. విచారణలో నిందితులు చోరీ చేసిన బంగారు, వెండి వస్తువులను మహారాష్ట్రకు చెందిన మంగేష్, నౌషాద్, రైస్ అనే ముగ్గురికి విక్రయించినట్లు వెల్లడించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆయా వ్యక్తుల వద్ద నుంచి బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసుల దర్యాప్తులో ఇప్పటివరకు మొత్తం 10 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ. 1,100 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. ఈ కేసును ఛేదించడంలో మద్నూర్ ఎస్సై మోహన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు విఠల్, విష్ణు, సీసీఎస్ కానిస్టేబుళ్లు గణపతి, రాజేందర్, శ్రీనివాస్, లక్ష్మీకాంత్, రవి చాకచక్యంగా వ్యవహరించారని సీఐ తెలిపారు.


