ఎల్లారెడ్డి: జాతీయ రహదారి 765/1 పనులు ఎల్లారెడ్డి పట్టణంలో నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని ట్యాంక్‌బండ్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల రహదారికి (రెండు వైపులా కలిపి 7 కిలోమీటర్ల) నేషనల్ హైవే పనులు ప్రారంభించి దాదాపు ఆరు నెలలు కావొస్తున్నది. అయితే, పట్టణ ప్రాంతంలో వేగంగా పూర్తి చేయాల్సిన పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రోడ్డును పూర్తి చేసిన తర్వాత మరోవైపు పనులు చేపడితే ఇబ్బందులు తలెత్తేవి కాదు. రెండు వైపులా పనులు ప్రారంభించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నిత్యం వందలాది మంది వచ్చి పోయే తహసీల్ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద, ప్రయివేటు ఆస్పత్రులు, ప్రధాన కూడలి అయిన అంబేడ్కర్ చౌరస్తా వద్ద పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. తహసీల్ కార్యాలయ గేట్ వద్ద డ్రెయినేజీ నిర్మాణ పనులు రోజులు కావొస్తున్నా పూర్తి కావడం లేదని సిబ్బంది తెలిపారు. గేట్ ముందర తవ్విన గుంతలను దాటుకొని కార్యాలయానికి వెళ్లలేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఎల్లారెడ్డి–కామారెడ్డి–మెదక్ ప్రధాన రహదారిపై ఉన్న అంబేడ్కర్ చౌరస్తా వద్ద పనులు పూర్తికాకపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
నత్తనడకన హైవే నిర్మాణ పనులు
కార్యాలయాలు, ఆస్పత్రులు,
ప్రధాన కూడళ్ల వద్ద నెలల తరబడి
సాగుతున్న వైనం
ఇబ్బందులుపడుతున్న పట్టణ ప్రజలు


