● వెల్లివిరిసిన దేశభక్తి
కామారెడ్డి అర్బన్: వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో దేశభక్తిభావం వెల్లివిరిసింది. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో ‘నమామి భారతం–వందేమాతరం 150 సంవత్సరాలు’ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని శ్రీసరస్వతి విద్యామందిర్, శిశుమందిర్, నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, టేక్రియాల్ కేజీబీవీ, జేపీఎన్ రోడ్డు, సర్ధార్ పటేల్ విగ్రహం ప్రాంతాల్లో పాఠశాలల విద్యార్థులు, పట్టణ ప్రముఖులు పాల్గొని వందేమాతరం ఆలపించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వందేమాతరం ఒక గేయం కాదని, ప్రతి భారతీయుడిలో దేశభక్తిని నింపే స్ఫూర్తి నినాదమని అన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు శ్యాంసుందర్, రంజిత్‌మోహన్, బొడ్డు శంకర్, ప్రతాప్‌గౌడ్, సామల గంగారెడ్డి, అర్కల మల్లేశ్ యాదవ్, పక్కి శ్రీనివాస్, సురేందర్‌రెడ్డి, ఎస్‌ఎన్.చారి, ఎం.ఆనంద్, పి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


