నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): శ్మశాన వాటికకు సరైన దారిలేక, ఆఖరి మజిలీ అగచాట్లమయంగా మారింది. నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు దుర్గవ్వ అంత్యక్రియల నిర్వహణలో కుటుంబసభ్యులు, బంధువులు అవస్థలు పడ్డారు. మృతదేహాన్ని ఖననం చేసే సంప్రదాయం కలిగిన కుటుంబాలు గ్రామ శివారులోని శ్మశాన వాటికకు తరలిస్తారు. అయితే, శ్మశానవాటికకు సరైన దారిలేక పోవడంతో దుర్గవ్వ పార్థివదేహాన్ని పంట పొలాల మధ్య నుంచే అవస్థలు పడుతూ మోసుకెళ్లారు. శ్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.


