భిక్కనూరు: మండల కేంద్రంలో స్వయంభూగా వెలిసిన అనంతపద్మనాభ స్వామి ఆలయంలో శుక్రవారం అనంత చతుర్దశి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. ఆలయ అర్చకులు పెద్దెడ్ల జయప్రకాశ్‌శర్మ, రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి వేకువ జామునుంచే పంచామృతాభిషేకాలు, అర్చనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే భక్తులు వెలిగించుకునే కోటి ఒత్తులకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలోనే ఏకై క ఆలయంగా పేరొందిన భిక్కనూరు స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభస్వామి ఆలయానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ప్రతి ఏటా అనంత చతుర్దశి రోజున వస్తారని అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలను భక్తులు విజయవంతం చేయాలని కోరారు.
బాన్సువాడ రూరల్: బాన్సువాడలో ఈనెల 27న నిర్వహించే జాతీయ సమైక్యతా సదస్సుకు హాజరు కావాలని కోరుతూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి నిర్వాహకులు ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా ఆహ్వాన పత్రికను గురువారం అందించారు. జాతీయ సమైక్యత, పరస్పర సోదరభావం, మతసామరస్యంతో పాటు శాంతిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈకార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మౌలాన రఫీఖ్, నాయకులు వాహబ్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద బుధవారం రాత్రి కొండచిలువ సంచారం కలకలం రెపింది. మాల్లారెడ్డి చెరువు సమీపంలో కొండచిలువ రోడ్డు దాటుతుండగా స్థానికులు చూసి భయందోళనకు గురైయ్యారు. ఆ తర్వాత అది మళ్లీ చెరువులోకి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.
కామారెడ్డి అర్బన్: శ్రీసరస్వతి విద్యామందిర్, విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నమామి భారతం వందేమాతరం పూర్తి గేయాలాపన చేయనున్నట్లు ప్రతినిధులు శ్యాంసుందర్, హరిస్మరణ్‌రెడ్డి, రాజారెడ్డి, మల్లేష్‌యాదవ్, గంగారెడ్డి, ఎం.ఆనంద్, ప్రతాప్‌గౌడ్ తెలిపారు. పట్టణంలోని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్, జీవదాన్ సర్ధార్ పటేల్ విగ్రహం, నిజాంసాగర్ చౌరస్తా, కొత్తబస్టాండ్, శివాజీ విగ్రహం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జయప్రకాశ్ నారాయణ విగ్రహం, భగత్‌సింగ్ నగర్ సరస్వతి శిశుమందిర్ వద్ద వందేమాతం పూర్తి గేయాలాపన ఉంటుందని అన్నారు.


