చెరువులో నీట మునిగి ఒకరి మృతి
దోమకొండ: మండల కేంద్రంలోని కుడి చెరువులోకి దిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బీబీపేట మండల కేంద్రానికి చెందిన లింగారి నవీన్(17) అనే యువకుడు పాత సామాన్లు, ఇనుప వస్తువులు ఎరుకుని అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. దోమకొండలో గణపతుల నిమజ్జనం పూర్తయిందని, ప్రతిమల కింద ఉన్న ఇనుప స్టాండ్లను అమ్ముకుందామనే ఆలోచనతో మిత్రుడితో కలిసి అతడు గురువారం చెరువు వద్దకు చేరుకున్నాడు. నీటిలోకి దిగిన తర్వాత తిరిగి ఒడ్డుకు చేరుకునే క్రమంలో ఊపిరి ఆడక మృతిచెందాడు. అదే సమయంలో దోమకొండకు చెందిన నూనె నవీన్ అనే వ్యక్తి సైతం అక్కడికి చేరుకున్నాడు. ఇరువురు వెంటనే విషయం పోలీసులకు, మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. పోలీస్ రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకుని నవీన్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు.
నిజామాబాద్ లీగల్: విధి నిర్వహణలో ఉన్న హోంగార్డును బైక్‌తో ఢీకొట్టి గాయపరిచిన కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషనన్స్ జడ్జి దారావత్ దుర్గాప్రసాద్ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా.. నగరంలోని పవర్‌హౌస్ చౌరస్తాలో మార్చి 30న నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన బొక్క దీపక్ పోలీసులకు సహకరించకుండా, తన బైక్‌ను అతివేగంగా నడిపి విధుల్లో ఉన్న హోంగార్డు నర్సింగ్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో నర్సింగ్ తీవ్రంగా గాయపడగా పోలీసులు కేసు నమోదు చేసి దీపక్‌ను కోర్టుకు తరలించారు. విచారణ చేపట్టిన జడ్జి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు.


