సమన్వయంతో..
పకడ్బందీ బందోబస్తు..
జిల్లాకేంద్రంలో శోభాయమానంగా సాగుతున్న నిమజ్జనోత్సవం
కామారెడ్డి టౌన్ : నవరాత్రులు విశేష పూజలందుకున్న బొజ్జ గణపయ్య.. గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి ప్రారంభమైన వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర గురువారం కనులపండువగా సాగింది. గణపతి బప్పా మోరియా నినాదాలు, డప్పు చప్పుళ్లతో పురవీధులు మారుమోగాయి. వరుసగా కదులుతున్న గణనాథులను చూడడానికి వేలాది మంది తరలివచ్చారు. దీంతో పట్టణం జనసంద్రంగా మారింది. ఇందిరాచౌక్ వద్ద విశ్వహిందూ పరిషత్, ఉత్సవ కమిటీల ప్రతినిధులు విగ్రహాలకు స్వాగతం పలికి నిర్వాహకులను ఘనంగా సన్మానించారు. డప్పు చప్పుళ్లు, నాసిక్ డోల్, తీన్మార్ బ్యాండ్‌ల దరువులకు అనుగుణంగా యువత ఉత్సాహంగా నృత్యం చేసింది. ధర్మశాల నుంచి మొదలైన నిమజ్జన శోభాయాత్ర సిరిసిల్లరోడ్, ఇందిరా చౌక్, రైల్వేస్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, మాయాబజార్, పాంచ్‌రస్తా, గోపాలస్వామిరోడ్, పెద్దబజార్, రైల్వే కమాన్, నిజాంసాగర్ చౌరస్తా మీదుగా టేక్రియాల్ చెరువు వరకు సాగింది.
శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసేలా జిల్లా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ బందోబస్తు నిర్వహించింది. ఎస్పీ రాజేశ్ చంద్ర పర్యవేక్షణలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ప్రత్యేక బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొన్నాయి. మున్సిపల్ పర్సన్ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు తదితరులు శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించారు. జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
టేక్రియాల్ పెద్ద చెరువు వద్ద మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా భారీ క్రేన్లు, డోజర్లను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెరువు లోతు ప్రాంతాల వద్ద మున్సిపల్ సిబ్బంది, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు.
ఘనంగా వినాయక విగ్రహాల
నిమజ్జనోత్సవం
నాసిక్ డోల్, డప్పు చప్పుళ్లతో
మారుమోగిన పురవీధులు
కనులపండువగా సాగిన శోభాయాత్ర


