ఉన్నతాధికారులకు నివేదిస్తా..
● ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని
బడికి వెళ్తున్న విద్యార్థులు
● ఏటా తప్పని ఇబ్బందులు
● వంతెన నిర్మించాలని కోరుతున్న ప్రజలు
పెద్దకొడప్‌గల్: వర్షాకాలంలో బడికి వెళ్లాలంటే ఆ ఊరి విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ చెరువు అలుగును దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. వివరాలిలా ఉన్నాయి. కుబ్యానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బ తండాకు చెందిన విద్యార్థులు చదువుకోవడం కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్లాబాద్ గ్రామ పాఠశాలకు వెళ్తుంటారు. ఈ దారి మధ్యలో పెద్ద చెరువు ఉంది. వర్షాలు కురిసి, అలుగు పారితే ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంటుంది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువు అలుగు పారుతుండడంతో విద్యార్థులు బడికి వెళ్లడానికి అవస్థలు పడ్డారు. ఏటా వర్షాలు కురిసినప్పుడు ఇదే ఇబ్బంది ఉంటోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే మార్గంలో వెళ్లాలంటే ఏడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని, అందుకే కష్టమైనా ఇదే దారిలో వెళ్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్న తహసీల్దార్ గురువారం పెద్దచెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు.


