ఎల్లారెడ్డి: భూగర్భ జలాల పెంపునకు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడేలా ఫాంపాండ్‌లను నిర్మించుకుని, సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మీసాన్‌పల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న ఫాంపాండ్‌ను గురువారం ఆయన పరిశీలించారు. పాండ్ నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం, సౌకర్యాలు, పాండ్ వినియోగం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాండ్ వద్ద పనిచేసే వారికి అవసరమైన తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతం నుంచి వర్షపు నీరు వృథాగా పోతోందని, ఫీడర్ చానల్ ద్వారా నీరు మళ్లిస్తే చెరువు పూర్తిస్థాయిలో నిండుతుందని రైతులు కలెక్టర్‌కు వివరించారు. ఈ విషయమై ప్రతిపాదనలు పంపాలని డీఆర్డీవోకు కలెక్టర్ సూచించారు. ఆయన వెంట సర్పంచ్ మైసయ్య, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ నరసయ్య, ఆర్డీవో ప్రభాకర్, ఎంపీడీవో తాహేరా బేగం, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఎంఈవో రాజులు, ఏపీవో వినోద్ తదితరులున్నారు.
ధాన్యం నిల్వకు ఫంక్షన్ హాల్ పరిశీలన
లింగంపేట(ఎల్లారెడ్డి): ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి సేకరించే ధాన్యం నిల్వ చేసేందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం గోదాములను పరిశీలించారు. లింగంపేట మండల కేంద్రంలోని ప్రముఖ హైకోర్టు న్యాయవాది మోహిన్ అమ్మద్ ఖాద్రీ రీసార్ట్‌లోని ఫంక్షన్ హాల్‌ను పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు. మార్పులు చేయాల్సి ఉంటే యజమాని అనుమతితో చేయించాలని అధికారులను ఆదేశించారు. క్యాప్(కవర్ అండ్ ప్లింత్) పద్ధతిలో ధాన్యం నిల్వ చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో ప్రభాకర్, సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో మలహరి, ఏఈలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
మ్యాపులు సిద్ధం చేయాలి
నిజాంసాగర్: రెవెన్యూ గ్రామాలు, భూములు, అటవీ విస్తీర్ణం, రెవెన్యూ స్థలాలను గుర్తించి మ్యాపులను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం మహమ్మద్‌నగర్ మండలం కొనంపల్లిలో రెవెన్యూ గ్రామ భూముల రీసర్వేను కలెక్టర్ తనిఖీ చేశారు. అటవీ, రెవెన్యూ శాఖల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి గ్రామాల వారీగా మ్యాపులు, సరిహద్దులను ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి, మహమ్మద్‌నగర్ తహసీల్దార్ లత, బాన్సువాడ అటవీ శాఖ సబ్ డీఎఫ్‌వో సునీత, ఎఫ్‌ఆర్‌వో అబీబ్, బీట్ అధికారి స్వరూప తదితరులున్నారు.


