మద్నూర్: తడిహిప్పర్గాలో మద్య నిషేధం విధించినట్లు సర్పంచ్ అశ్విని తెలిపారు. గురువారం ఈ విషయమై గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో ఎక్కడా మద్యం అమ్మరాదని, ఎవరైన ఈ నిబంధనను అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని సర్పంచ్ హెచ్చరించారు.
భిక్కనూరు: పెద్దమల్లారెడ్డిలో భీందళ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద నవరాత్రులు పూజలు అందుకున్న వినాయక లడ్డూను గురువారం వేలం వేశారు. హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్ తన అమ్మమ్మ గ్రామమైన పెద్దమల్లారెడ్డికి వచ్చి వేలంలో పాల్గొన్నారు. ఆయన రూ. 1,11,116 లకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్ అండర్–14, 17 బాలబాలికల టోర్నమెంట్ ఎంపికలు ఈ నెల 25న ఉదయం 9 గంటల నుంచి గాంధారి మండలం పోతంగల్‌లో నిర్వహించనున్నట్టు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈ.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14 క్రీడాకారులు 1 జనవరి 2013 తర్వాత, అండర్–17 క్రీడాకారులు 1 జనవరి 2010 తర్వాత జన్మించి ఉండాలని, బోనాఫైడ్, ఆధార్ కార్డుతోపాటు క్రీడాదుస్తులు, షూస్‌తో హాజరుకావాలని పేర్కొన్నారు. వివరాలకు 9440004112, 94410 42622 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
కామారెడ్డి అర్బన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి అర్చరీ అండర్–14, 17 బాలబాలికల ఎంపిక పోటీలను శనివారం నిర్వహించనున్నారు. బాన్సువాడ మండలంలోని కొత్తాబాది తిర్మలాపూర్ క్యాంప్ జెడ్పీ హైస్కూల్‌లో ఉదయం 8 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్, స్పోర్ట్స్ డ్రెస్, పరికరాలతో హాజరు కావాలని, వివరాలకు 94400 04112, 94415 79518 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నిజామాబాద్ రూరల్: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి యువత, ప్రజలు సహకరించాలని జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్ కోరారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని గురువారం జెడ్పీలో నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై వివిధ పోటీల్లో గెలుపొందిన పాఠశాల, కళాశాల విద్యార్థులను అభినందించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించే పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని జిల్లా పర్యాటకశాఖ అధికారి పవన్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో పాలి టెక్నిక్ కళాశాల అధ్యాపకులు రాఘవేంద్ర, లలిత, సురేశ్, గంగాదాస్ పాల్గొన్నారు.


