● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని అడ్లూర్ ఎల్లా రెడ్డి (టేక్రియాల్) చెరువులో జరుగుతున్న వినా యక నిమజ్జన కార్యక్రమ తీరును కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం పరిశీలించారు. చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టేక్రియాల్ చెరువులో 700 పైగా గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉందన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చెరువు వద్ద పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అనుమతిలేని వ్యక్తులు చెరువులోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెద్ద క్రేన్లను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చెరువు వద్ద రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ వైర్లు గణేశ్ విగ్రహాలకు తగలకుండా తగిన ఎత్తులో ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో విద్యుద్దీపాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భక్తులు నిమజ్జన కార్యక్రమంలో జాగ్రత్తలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.


