కామారెడ్డి క్రైం: వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 420 మందికి విధులు కేటాయించారు. ఇందులో ముగ్గురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 16 మంది ఎస్సైలు, ఇతర సిబ్బంది ఉన్నారు. శోభాయాత్ర మార్గంలో 3 డ్రోన్లు, 162 అదనపు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లు, నిమజ్జన ఘాట్ల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట బారికేడ్లు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినా లేదా ఏదైనా అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా వెంటనే సమీపంలోని పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.


