ఆటో బోల్తా.. మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. మహిళ మృతి

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

ఆటో బోల్తా.. మహిళ మృతి ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య అవమానం భరించలేక మరొకరు.. విద్యుదాఘాతంతో రైతు మృతి తల్లీకొడుకు అదృశ్యం

బాన్సువాడ రూరల్‌: మండలంలోని కొయ్యగుట్ట సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగితం గ్రామానికి చెందిన కంచం ఇందు (21) అనే యువతి మృతి చెందింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సింగీతం గ్రామంలోని బాగ్వాన్‌బాబకు చెందిన పప్పు బ్యాగులతో కూడిన ప్యాసింజర్‌ ఆటో బాన్సువాడ వైపు వస్తోంది. ఆటోలోని డ్రైవర్‌ పక్కన సీటులో ఇందు కూర్చొని ప్రయాణిస్తుంది. కొయ్యగుట్ట సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఇందుపై ఆటో పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కంచం ఇందు తండ్రి చనిపోయాడని, భర్త కొన్నేళ్ల క్రితం వదిలేశాడు. మూడేళ్ల కుమారుడు, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి లక్ష్మి, చెల్లెలితో కలిసి ఉండేది. ఇళ్లలో పనిచేస్తూ కుమారుడు, తల్లి, చెల్లిని పోషించేదని, ఆమె మృతితో వారంతా అనాథలయ్యారని గ్రామస్తులు తెలిపారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన తొడెంగల స్వామి(42) అలియాస్‌ టింగుల సాయిలు కృష్ణాజివాడి శివారులో కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగాయి. అప్పు తీర్చే మార్గంలేక తీవ్ర మనస్తాపానికి గురై, జీవితంపై విరక్తితో స్వామి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య స్వాతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

గాంధారి(ఎల్లారెడ్డి): అవమానం భరించలేక ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గాంధారి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్రి సంతోష్‌ (35) తాను ఉంటున్న కాలనీకి చెందిన ఓ మహిళకు మంగళవారం రాత్రి ఫోన్‌ చేశాడని సదరు మహిళ కుమారులకు చెప్పింది. దీంతో ఆమె ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమీపంలో రోడ్డుపై సంతోష్‌ను పట్టుకొని చితకబాదారు. రాత్రి ఇంటికి వచ్చి పడుకున్న సంతోష్‌ బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. వాగు అవతలి వైపు పెద్దమ్మ చెలక శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు మహిళతోపాటు ఆమె ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రైలు కిందపడి గుర్తు తెలియని వృద్ధుడు..

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌కు సమీపంలో బుధవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వృద్ధుడు (50) గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మృతుడిని గుర్తించేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే నిజామాబాద్‌ రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతంతో రైతు మరణించిన ఘటన తాడ్వాయి మండలం చందాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్‌ తెలిపిన ప్రకారం.. చందాపూర్‌ గ్రామానికి చెందిన ఎండీ నాజర్‌ అహ్మద్‌(57) పంటకు నీరు పెట్టేందుకు మధ్యాహ్నం పొలానికి వెళ్లాడు. స్టార్టర్‌లో మరమ్మతులు చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై కింద పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని, అపస్మారకస్థితిలో ఉన్న నాజర్‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి నాజర్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి బంధువు మొహమ్మద్‌ ఫహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

జనగామలో మహిళ..

బీబీపేట: ఇంటి వద్ద బల్బును అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి మహిళ మృతి చెందిన ఘటన బుధవారం జనగామ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్‌చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైకరి నర్సవ్వ (55) ఇంటి వద్ద బల్బును పెడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మరణించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

వర్ని: మండలంలోని ఓ తండాకు చెందిన వివాహిత, మూడేళ్ల కుమారుడు అదృశ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 21న ఆస్పత్రికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement