కానరాని సెల్లార్లు! | - | Sakshi
Sakshi News home page

కానరాని సెల్లార్లు!

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

● పార్కింగ్‌లేక.. రోడ్లపైనే వాహనాలు

● నిబంధనలు కాగితాలకే పరిమితం

● ట్రాఫిక్‌ రద్దీతో వాహనదారుల అవస్థలు

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో వాణిజ్య భవనాల నిర్మాణంలో నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులు తీసుకునే సమయంలో సెల్లార్‌ పార్కింగ్‌ చూపిస్తున్నా.. నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆ ప్రాంతాన్ని వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాల్లో పార్కింగ్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. వాహనాలను రోడ్లపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.

50 వేలకు పైగా జనాభా..

బాన్సువాడ మున్సిపల్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీగా వాణిజ్య భవనాలు వెలుస్తున్నాయి. 19 వార్డుల్లో సుమారు 20 వేలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు అంచనా. మరోవైపు పట్టణ విస్తరణతో జనాభా కూడా పెరుగుతోంది. దీంతో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ అధికమవుతోంది. పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు.

వాణిజ్య భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే సమయంలో సెల్లార్‌ పార్కింగ్‌ను తప్పనిసరిగా చూపిస్తున్నప్పటికీ.. నిర్మాణం పూర్తయిన తర్వాత పరిస్థితి మారుతోందన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని భవనాల్లో పార్కింగ్‌ కోసం కేటాయించిన సెల్లార్‌ ప్రాంతాలను దుకాణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భవనాలకు వచ్చే వినియోగదారులు వాహనాలను రోడ్లపైనే నిలపాల్సి వస్తోంది.

అధికారుల తనిఖీలు శూన్యం

పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో సెల్లార్‌ పా ర్కింగ్‌ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనే విషయంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. అనుమతుల సమయంలో చూపించిన పార్కింగ్‌ స్థలాన్ని నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా అదే విధంగా వినియోగిస్తున్నారా.. లేదా వ్యాపార అవసరాలకు మార్చేశారా? అనే అంశంపై తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement