● ఎన్‌డీసీసీబీ సీఈవో నాగభూషణం వందే
సుభాష్‌నగర్: సహకార ప్రబోధిని విద్యా మాసపత్రిక సహకార రంగంలో విశేష సేవలు అందిస్తుందని ఎన్‌డీసీసీబీ సీఈవో నాగభూషణం వందే తెలిపారు. బుధవారం సహకార ప్రబోధిని మాస పత్రిక సంపాదకుడు భూమయ్య సాంబరపు జిల్లా కేంద్రంలోని ఎన్‌డీసీసీబీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నాగభూషణం వందే మాట్లాడుతూ సహకార రంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ సహకార ఆర్థిక సంస్థల సింపోజియానికి హాజరై అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవాలని ప్రత్యేక ఆహ్వానం అందడం విశేషమని కొనియాడారు. ప్రపంచ స్థాయి వేదికపై సహకార రంగానికి సంబంధించిన చర్చల్లో పాల్గొనే అవకాశం లభించడం భూమయ్య సాంబరపు సహకార రంగ సేవలకు లభించిన ప్రత్యేక గుర్తింపుగా భావించవచ్చన్నారు. సహకార రంగానికి సంబంధించిన విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ‘సహకార ప్రబోధిని’ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. అనంతరం భూమయ్యను సీఈవో ఘనంగా సత్కరించారు. అనంతరం సహకార రంగ అభివృద్ధి, సహకార బ్యాంకుల పాత్ర తదితర అంశాలపై వారితో చర్చించారు. కార్యక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారి అనుపమ, ఉద్యోగులు పాల్గొన్నారు.


