కామారెడ్డి క్రైం: జిల్లాలో గణేశ్ ఉత్సవాలు, శోభాయాత్రల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని డీజేల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డీజేల కారణంగా ప్రాణహాని, ఇతర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం డీజే పెట్టడం నిషిద్ధమన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల్లో సంప్రదాయ డప్పులు, వాయిద్యాలను వినియోగించాలని సూచించారు. ఇప్పటికే అడ్వాన్సులు తీసుకుని ఉంటే వాపస్ ఇచ్చేయాలని డీజేల నిర్వాహకులకు సూచించారు. సమావేశంలో ఏఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మదుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


