లింగంపేట: మండలంలోని నాగారం గ్రామ శివారులోని పంట పొలాల వద్ద శనివారం రాత్రి ఓ మహిళ హత్యకు గురైన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామానికి చెందిన చింతకుంట అనసూయ(34) అదే గ్రామానికి చెందిన వ్యక్తితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు తిరుపతి ఉన్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నేళ్ల తర్వాత భర్త అనసూయను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కాగా అనసూయ కొర్పోల్‌కు చెందిన గుట్టమీది సాయిలుతో దశాబ్ద కాలంగా సహజీవనం కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలు అనసూయ తల్లి చంద్రవ్వ, తిరుపతితో కలిసి హైదరాబాద్‌లో జీవిస్తోంది. ఇంటి వద్ద సాగు చేస్తున్న పంట పొలాలను చూసేందుకు వారానికి ఒక సారి వచ్చి చూసి వెళ్లేది. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన అనసూయ తన పంట పొలానికి శనివారం వెళ్లింది. సహజీవనం కొనసాగిస్తున్న వ్యక్తి ఆమెను పొలంలో ఇనురాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన స్థలానికి ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, లింగంపేట ఎస్సై దీపక్‌కుమార్ సిబ్బందితో చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన స్థలంలో లభించిన ఇనుపరాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫింగర్ ప్రింట్ సిబ్బందితో వేలిముద్రలు సేకరించారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై పేర్కొన్నారు.


