● ఈదురు గాలుల బీభత్సంతో
కన్నీరుమున్నీరు
● నష్ట పరిహారం ఇప్పించాలని
కోరుతున్న రైతులు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని సముందర్ తండాలో ఇటీవల ఆకస్మాత్తుగా వీచిన ఈదురు గాలులతో కూడిన వర్షం స్థానిక రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. చేతికి వస్తుందనుకున్న పంటంతా కళ్లెదుటే నేలకూలడంతో అన్నదాతలు నెత్తినోరు బాదుకుంటున్నారు. తండాలో చాలా మంది రైతులు ఎంతో కష్టపడి, పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించి మొక్కజొన్న పంటను సాగుచేశారు. ప్రస్తుతం ఈ పంట పాలుపోసుకునే(గింజ ఏర్పడే) కీలక దశలో ఉంది. ఈ తరుణంలో వీచిన బలమైన ఈదురు గాలులకు భారీ ఎత్తున మొక్కజొన్న చేలన్నీ పూర్తిగా నేలకొరిగాయి. ఈ దశలో మొక్కజొన్న మొక్క విరిగిపడినా, నేలకొరిగినా గింజలో పూర్తిస్థాయిలో విత్తు(ధాన్యం)నిండదని, దాంతో దిగుబడి పూర్తిగా దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందే పరిస్థితి లేదని, తాము తీవ్ర ఆర్థిక నష్టాల బారిన పడ్డామని కన్నీరుమున్నీరవుతున్నారు. అన్నదాతలను ఆదుకోవడానికి వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి, నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించి నష్టపరిహారం అందజేయాలని తండా రైతులు కోరుతున్నారు.


